ఓ చిరుత పులి ఓ రైతు కుటుంబాన్ని హడలెత్తించింది. అందరూ కూర్చొని భోజనం చేస్తుండగా.. ఆ ఇంట్లోకి చిరుత ప్రవేశించి అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. కానీ ఏ ఒక్కరికి కూడా చిరుత హానీ కలిగించలేదు. దీంతో రైతు కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర పుణె పరిధిలోని పింపల్‌వాండి ఏరియాలో విలాస్ రాయ్‌కర్ అనే రైతు తన కుటుంబంలో కలిసి జీవిస్తున్నారు. ఈయన ఇల్లు చెరుకు, ద్రాక్ష తోటలకు సమీపంలో ఉంది. అయితే సోమవారం రాత్రి ఓ చిరుత గ్రామంలోకి ప్రవేశించింది. దానికి ఓ పిల్లి కనిపించింది. ఇంకేముంది చిరుత పిల్లిని వెంబడించింది. ఆ పిల్లి రైతు విలాస్ ఇంట్లోని కిచెన్‌లోకి పరుగెత్తింది.
చిరుత కూడా పిల్లితో పాటు ఇంట్లోకి దూసుకొచ్చింది. దీంతో భోజనం చేస్తున్న రైతు కుటుంబం చిరుతను చూసి షాక్ అయ్యారు. గట్టిగా అరిచారు. కుటుంబ సభ్యుల అరుపులకు చిరుత భయపడి వెనక్కి వెళ్లిపోయింది. ఏ ఒక్కరిపై కూడా చిరుత దాడి చేయలేదు. దీంతో రైతు కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇక రాత్రంతా విలాస్ కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాలేదు.
మరుసటి రోజు ఉదయం విలాస్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. చిరుతను గ్రామంలోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. బోను ఏర్పాటు చేయాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేనందునే ఇంటికి ప్రహరీ గోడ నిర్మించుకోలేదని విలాస్ పేర్కొన్నాడు.