జైపూర్ : ఓ చిరుత పులి ఏకంగా ఓ హోటల్ గదిలోకి ప్రవేశించింది. దీంతో టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఓ హెరిటేజ్ హోటల్‌లో గురువారం చోటు చేసుకుంది.
గురువారం ఉదయం సమయంలో హోటల్ ప్రాంగణంలోకి చేరుకున్న చిరుత పులి అక్కడున్న స్టాఫ్ రూమ్‌లోకి దూరింది. చిరుత గదిలోకి ప్రవేశించిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేరు. ఇక చిరుతను గమనించిన సిబ్బంది.. క్షణాల్లోనే ఆ గది తలుపులు మూసేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
హోటల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుతకు మత్తు ఇచ్చి బంధించారు. అనంతరం దానికి ప్రాథమిక చికిత్స అందించి, అడవిలో వదిలేశారు. చిరుతలు కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని టూరిస్టులకు అధికారులు సూచించారు. ఇక హోటల్‌లో చిరుత టూరిస్టులపై దాడి చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.