Lockup Death: నిజామాబాద్‌లో.. గల్ఫ్ ఏజెంట్ లాకప్ డెత్?
నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనే వ్యక్తి లాకప్ డెత్ కు గురికావడం వివాదస్పదమైంది. పోలీసులు కొట్టడంతోనే అతను మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Nizamabad Lockup death:
తెలంగాణ రాష్ట్రంలో లాకప్ డెత్ వ్యవహారం సంచలనం రేపింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనే వ్యక్తి లాకప్ డెత్ కు గురికావడం వివాదస్పదమైంది. పోలీసులు కొట్టడంతోనే అతను మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్‌ను ఇటీవల నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సంపత్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహిస్తున్నాడు. తన కన్సల్టెన్సీ ద్వారా దుబాయ్ పంపిస్తానని సంపత్ మోసం చేశాడని పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువకుల ఫిర్యాదు మేరకు సంపత్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
విచారణ నిమిత్తం కోర్టు నుంచి రెండు రోజుల పాటు సంపత్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు సంపత్‌ను పోలీసులు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో సంపత్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సంపత్‌ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే సంపత్ మృతి చెందాడు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని సంపత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సంపత్ మృతిపై నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి స్పందించారు. సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడని, వైద్యులు కూడా చూశారని వివరించారు. రిమాండ్ ఖైదీ సంపత్ మృతి పై ఎంక్వయిరీ జరుగుతోందన్నారు. విచారణ జరిపించడానికి మేజిస్ట్రేట్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి రానున్నట్లు తెలిపారు. ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేస్తారని వెల్లడించారు. సంపత్ మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఫ్రెండ్లీ పోలీస్ నినాదం వినిపిస్తున్న తెలంగాణలో తరుచు లాకప్ డెత్ ఘటనలు చోటుచేసుకోవడం విచారకరం. 2023లో గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ కు గురయ్యాడు. అదే ఏడాది మెదక్ పోలీస్ స్టేషన్ లో ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి సైతం లాకప్ డెత్ పాలయ్యాడు. హైదరాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరంజీవి అనే పాత నేరస్తుడు కూడా ఇదే ఏడాది పోలీసుల దెబ్బలతో లాకప్ డెత్ చెందాడు. 2021లో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ అనే మహిళ ఫోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంతో లాకప్ డెత్ కు గురైంది. తాజాగా నిజమాబాద్ పోలీస్ స్టేషన్ లో సంపత్ లాకప్ డెత్ చోటుచేసుకుంది.