" /> " /> " /> " />
విధాత: ఎన్నికలు సమీపిస్తున్నాయ్… ఉన్నంతలో తమ పనితీరు, గ్రాఫ్‌ను మెరుగుపర్చుకుని ఓట్ల పోటీలో నిలిచి, గెలిచేందుకు ఆయా పార్టీలు తమకు వీలయినన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని అధికారం చేపట్టేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువనేత లోకేష్ సైతం దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ సిద్ధమైంది. జనవరి 27న ప్రారంభించి దాదాపు 400 రోజులు ప్రజల మధ్యనే ఉంటూ 4000కిమీ పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైంది.
ఈ మేరకు యువతను ఇందులో భాగస్వాములను చేసే లక్ష్యంతో “యువగళం” పేరిట ఈ పాదయాత్ర కొనసాగిస్తారు. వాస్తవానికి గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేసిన వారంతా ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. అసలు పాదయాత్ర కాన్సెప్టును ప్రజలకు పరిచయం చేసిందే వైఎస్సార్.
ఆయన 2003లో పాదయాత్ర చేసి ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి హామీలు ఇస్తూ యాత్ర పూర్తి చేశారు. ఆయన కష్టం వృథా పోలేదు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ గెలవగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత చంద్రబాబు సైతం 2013లో పాదయాత్ర చేసి 2014లో ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం 2018లో పాదయాత్ర చేసి 3300 కిలోమీటర్లు నడిచి వేలాది మంది ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారిలో మమేకం అయ్యారు. ఫలితంగా 2019లో ఆయన తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సైతం భారత్ జోడో యాత్ర అంటూ పలురాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజలు, కార్యకర్తలు, తటస్థులు, మేధావుల నుంచి సైతం మంచి స్పందన వస్తోంది. వేలాదిమంది ప్రజలు రాహుల్ గాంధీతో కలిసి ఆడుగులు వేస్తున్నారు.
ఈ ప్రజాస్పందన ఖచ్చితంగా తమకు మేలు చేస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. ఇక లోకేష్ సైతం ఇప్పటికే పాదయాత్రకు సిద్ధమయ్యారు. అన్ని జిల్లాలు, దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో పర్యటన సాగేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ యాత్ర కొనసాగుతుందని అంటున్నారు.
యువత, ఉపాధి, విద్యావకాశాలు, వారి కెరీర్ వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్దగా చేసిందేమీ లేదని, జాబ్ క్యాలెండర్ రాలేదని, రిక్రూట్మెంట్స్ లేవని, పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్నవాటిని వెళ్ళగొడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పాయింట్లను బేస్ చేసుకుని యువతను ఆకట్టుకునేలా ఎజెండా రూపొందిస్తున్నారు.
ఈ మేరకు ఇప్పటికే లోకేష్ కు శిక్షణ కూడా ఇచ్చారని, మానసికంగా, శారీరకంగా సిద్ధం చేశారని అంటున్నారు. చంద్రబాబు సభలకు పెద్ద సంఖ్యలో జనం వస్తుండడంతో లోకేష్‌కు కూడా అదే రకమైన ఆదరణ ఉంటుందని టీడీపీ ఆశిస్తోంది.