అమరావతి రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ పేరు

  • Publish Date - September 26, 2023 / 11:23 AM IST
  • ఏ -14 గా పేర్కొంటూ కేసు బుక్ చేసిన సీఐడీ


విధాత‌: అటు స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా ఇక ఇటు లోకేష్ మీద కూడా ఇంకో కేసు నమోదైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్చేసి తమ అనుయాయులకు లబ్ది చేకూర్చడం, తద్వారా తాము ముడుపులు తీసుకోవడం అనే కుంభ కోణంలో లోకేష్ పేరును ఏ -14 గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.


మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యువగళం పాదయాత్రకు లోకేష్ సిద్ధం అవుతున్నారు. అయితే కొన్ని రోజులుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు మీద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు తాజాగా మెమో ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చిన పోలీసులు దాన్నిపుడు లోకేష్ వరకూ తెచ్చారు. ఇక ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇక సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా వేశారు.


సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును డిజైన్ చేసిన టిడిపి సర్కారు ఆ తరువాత దాని డిజైన్ మార్చేసి తమ అనుయాయులు అయినా లింగమనేని రమేష్ వంటివారి భూముల పక్కాగా రోడ్డు వెళ్లేలా చేసి వారి భూముల ధరలు పెరగడానికి దోహదపడ్డారని అభియోగం.


ఇలా చేసినందుకు గాను ఉండవల్లి కరకట్టపై ఇల్లు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు భూములు క్విడ్ ప్రోకోగా దక్కాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబు ను ఏ-1 గా, అప్పటి మున్సిపల్ మంత్రి ఏ-2 గా కేసు బుక్ అయింది. ఇప్పుడు ఇదే కేసులో లోకేష్ ను ఏ-14గా చేర్చింది.