Rajasthan | ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. జీవితాంతం ఆమెతో కలిసి ఉండాలనుకున్నాడు. ఆమె తన ప్రపంచంగా భావించి కలలు కన్నాడు. కానీ చివరకు అతని కలలు కలలుగానే మిగిలిపోయాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో తుపాకీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
భిల్వారా సిటీకి చెందిన ఓ 17 ఏండ్ల యువకుడు తన క్లాస్‌మేట్‌పై మనసు పారేసుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. అందుకు యువతి కూడా అంగీకరించింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఆ అమ్మాయికి మరొకరితో వివాహమైంది. దీంతో ప్రియుడు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఆమె లేకుండా జీవించడం కష్టంగా భావించాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి మహాత్మాగాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో తుపాకీతో కాల్చుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తన ప్రియురాలికి తనకు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువకుడు తన వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.