Green Land | ఒక్క టికెట్ రూ.27 లక్షలు.. సముద్రంలో ఇరుక్కుపోయిన లగ్జరీ క్రూజ్ షిప్! 206 మంది అందులోనే
Green Land | ప్రతికూల వాతావరణంతో కొనసాగని సహాయక చర్యలు ప్రయాణికులు మరికొన్ని రోజులు షిప్‌లోనే..! గ్రీన్‌ల్యాండ్‌కు సమీపంలో నడి సముద్రంలో ఒక భారీ క్రూయిజ్ షిప్ నిలిచిపోయింది. అది కదలడానికి కావల్సిన నీరు ఆ ప్రాంతంలో లేకపోవడంతో తీరం వైపు రావడం కష్టంగా మారింది. బుధవారం ఈ ఘటన జరగగా ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఓషన్ ఎక్స్‌ప్లోరర్ అనే ఈ క్రూజ్‌లో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 206 మంది ఉన్నారని అంచనా. వీరంతా […]

Green Land |
- ప్రతికూల వాతావరణంతో కొనసాగని సహాయక చర్యలు
- ప్రయాణికులు మరికొన్ని రోజులు షిప్‌లోనే..!
గ్రీన్‌ల్యాండ్‌కు సమీపంలో నడి సముద్రంలో ఒక భారీ క్రూయిజ్ షిప్ నిలిచిపోయింది. అది కదలడానికి కావల్సిన నీరు ఆ ప్రాంతంలో లేకపోవడంతో తీరం వైపు రావడం కష్టంగా మారింది. బుధవారం ఈ ఘటన జరగగా ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఓషన్ ఎక్స్‌ప్లోరర్ అనే ఈ క్రూజ్‌లో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 206 మంది ఉన్నారని అంచనా. వీరంతా పస్తుతం సముద్రంలోనే చిక్కుకుపోయారు.
పడవలను లాగే భారీ ట్రాలర్‌ను పెట్టి ఈ క్రూజ్ షిప్‌ను కదిలిద్దామని ప్రయత్నించినా సఫలం కాలేదు. సముద్రపు పోటు పెరిగితే తప్ప ఆ క్రూజ్‌ను కదిలేలా చేయడం అసాధ్యమని తెలుస్తోంది. కనీసం ప్రయాణికులను తీసుకురావడానికి కూడా వాతావరణం సహకరించట్లేదని డానిష్ మిలటరీకి చెందిన జాయింట్ ఆర్కిటిక్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే క్రూజ్ దృఢంగా ఉండటంతో వారి ప్రాణాలకు ముప్పు లేదని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ ఈ క్రూజ్‌ను నిర్వహిస్తోంది. గ్రీన్‌ల్యాండ్ రాజధాని నూక్‌కు 1400 కి.మీ. దూరంలో ఉన్న అల్పేఫ్‌జోర్డ్ పార్క్‌కు ఇది సందర్శకులను తీసుకెళుతుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 1న బయలుదేరిన ఓషన్ ఎక్స్‌ప్లోరర్.. ఈ నెల 21న తిరిగి నూక్‌కు తిరిగి రావాల్సి ఉంది.
అయితే నేషనల్ పార్కుకు కొద్ది దూరంలో ఇది ఇరుక్కుపోవడంతో సమస్య మొదలైంది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పుడు అంచనాకు రాలేమని అధికారులు తెలిపారు. దీనిని బయటకు తీసుకొచ్చే సామర్థ్యమున్న రెస్క్యూ వెసెల్ ఈ క్రూజ్ దగ్గరకు రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది.
అయితే ఇప్పుడు ఆ షిప్‌లో పెరుగుతున్న కొవిడ్ కేసులు అధికారులకు చెమట్లు పట్టిస్తున్నాయి. ఇప్పటికి ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ నిర్ధరణ కాగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు లక్షణాలతో బాధ పడుతున్నారు. షిప్‌లో అనుభవజ్ఞుడైన వైద్యుడు ఉన్నారని.. ఆందోళన అవసరం లేదని నిర్వాహకులు భరోసా ఇచ్చారు. ఈ ట్రిప్‌కు ఒక్కో ప్రయాణికుడి నుంచి 33 వేల డాలర్లు (సుమారు రూ.27 లక్షలు) వసూలు చేసినట్లు సమాచారం.