యాదాద్రిలో వైభవంగా మహా పూర్ణహుతి, చక్ర తీర్థం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను శాస్త్ర యుక్తంగా నిర్వహించారు

  • By: Somu    latest    Mar 20, 2024 10:11 AM IST
యాదాద్రిలో వైభవంగా మహా పూర్ణహుతి, చక్ర తీర్థం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో మూలవర్యులకు నిత్య ఆరాధనలు, అభిషేకాలు అనంతరం బ్రహ్మోత్సవాల పర్వంలో మహా పూర్ణాహుతి, చక్రతీర్థం ఘట్టాలను నిర్వహించారు.


బ్రహ్మోత్సవాలకు వేంచేసి ఉన్న దేవతలకు మహాపుర్ణాహుతి ద్వారా హావిస్సులు అందించారు. లోక కల్యాణం..సమస్త సృష్టి సస్యశ్యామలయం కావాలని కోరుతూ యాజ్ఞిక, అర్చక బృందం దేవతలకు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారి చక్ర తీర్థ స్నాన ఘట్టాన్ని స్వామివారి పుష్కరణిలో భక్తుల గోవింద నామస్మరణ మధ్య వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుష్ప యాగం, దేవతోద్వాసన, డోపు ఉత్సవం నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల 11వ రోజు రేపు శుక్రవారం ఉదయం అష్టోత్తర శతకటాభిషేకం, రాత్రి శృంగారడోలోత్సవం, ఋత్విక్ సన్మానాలతో బ్రహ్మోత్సవాల పర్వం పరిసమాప్తం కానుంది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో ఎ. భాస్కర్‌రావు, అనువంశికి ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.