Mahakutami | మహా కూటమి పొలికేక.. 15న బీహార్‌ వ్యాప్తంగా నిరసనలు

Mahakutami | మోదీ వైఫల్యాలను ఎండగడతాం ప్రతిపక్షాల ఐక్యతకు ఇది నమూనా 7 పార్టీల మహాకూటమి నేతల వెల్లడి 23న భేటీకి 18 పార్టీల నేతల హాజరు ఫరూఖ్‌, ముఫ్తీ కూడా వస్తారన్న జేడీయూ పాట్నా: నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు సమరశంఖం పూరించేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెల 23న పాట్నాలో నిర్వహించే విపక్షాల భేటీ సందర్భంగా బీహార్‌ ‘మహాకూటమి’ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏండ్ల మోదీ పాలనకు వ్యతిరేకంగా 15వ […]

  • By: krs    latest    Jun 13, 2023 5:16 AM IST
Mahakutami | మహా కూటమి పొలికేక.. 15న బీహార్‌ వ్యాప్తంగా నిరసనలు

Mahakutami |

  • మోదీ వైఫల్యాలను ఎండగడతాం
  • ప్రతిపక్షాల ఐక్యతకు ఇది నమూనా
  • 7 పార్టీల మహాకూటమి నేతల వెల్లడి
  • 23న భేటీకి 18 పార్టీల నేతల హాజరు
  • ఫరూఖ్‌, ముఫ్తీ కూడా వస్తారన్న జేడీయూ

పాట్నా: నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు సమరశంఖం పూరించేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెల 23న పాట్నాలో నిర్వహించే విపక్షాల భేటీ సందర్భంగా బీహార్‌ ‘మహాకూటమి’ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏండ్ల మోదీ పాలనకు వ్యతిరేకంగా 15వ తేదీన వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఈ నిరసన కార్యక్రమాలకు రూపునిచ్చారు. ప్రతిపక్షాల రణభేరికి బీహార్‌లో జరిగే నిరసనలు నాందీవాచకంగా భావిస్తున్నారు.

అంతేకాకుండా ప్రతిపక్షాల ఐక్యతకు ఒక నమూనాను దేశానికి చూపించే విధంగా తమ కార్యక్రమాలు ఉండబోతున్నాయని జేడీయూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్‌ చెప్పారు. బీహార్‌లో ఏడు పార్టీలు మహాకూటమిగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ స్థాయిలో అన్ని పార్టీలూ సంయుక్తంగా ధర్నాలు నిర్వహించనున్నాయి.

ఈ ధర్నాకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ అరెస్టును డిమాండ్‌ చేస్తూ సుదీర్ఘ ఆందోళన నిర్వహిస్తున్న రెజ్లర్లు కూడా హాజరుకానున్నారని సమాచారం. బీహార్‌ మహాఘట్‌బంధన్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌), హెచ్‌ఏఎం భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా మోదీ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలపై ప్రత్యేకంగా రెండు పేజీల కరపత్రాన్ని కూడా తీసుకొస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేసేలా ఈ నిరసనలు ఉండబోతున్నాయని కూటమి నేత ఒకరు తెలిపారు. సంయుక్త నిరసనల ద్వారా మోదీ వైఫల్యాలను వెలుగులోకి తెస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్‌ ప్రసాద్‌సింగ్‌ చెప్పారు.

తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు తాము మద్దతుగా నిలుస్తామని ఆయన తెలిపారు. నిరసనలు మంచి సమన్వయంతో సాగేలా ఇప్పటికే క్షేత్రస్థాయిలో వివిధ స్థాయిల నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సమావేశానికి ఫరూఖ్‌, ముఫ్తీ

పాట్నాలో 15న జరిగే విపక్షాల సమావేశానికి జమ్ముకశ్మీర్‌ కీలక నేతలు ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా హాజరుకానున్నారు. బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు సన్నిహితుడని పేరున్న జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లలన్‌ చెప్పారు. పార్టీ బీహార్‌ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ సహా 18 పార్టీల నాయకులు పాట్నా సమావేశానికి వస్తున్నారని వెల్లడించారు.