విధాత: ప్రశ్నపత్రాల లకేజీ ఉదంతంతో ఛైర్మన్ జనార్దన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామాలు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆమోదించారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసింది. ఛైర్మన్, సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ నాటికి ఆ గడువు ముగిసింది. ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో సర్వీస్ కమిషన్‌పై నిరుద్యోగ అభ్యర్థుల్లో విశ్వాసం సన్నగిల్లింది. నాడు విపక్షంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామన్నారు.
కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. దానికి అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి నేత్వత్వంలో యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనితో సమావేశమయ్యారు. కమిషన్ ప్రక్షాళనతో పాటు, ఏటా జాబ్ క్యాలెండర్, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్‌పీఎస్సీలో చేయాల్సిన మార్పులపై వారితో చర్చించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన భరోసా మేరకు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించే బాధ్యతలను రిటైర్డ్ ఐపీఎస్‌లకు అప్పగించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఛైర్మన్ పదవి కోసం మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ పదవి కోసం మరో రిటైర్డ్ అధికారితో పాటు రెండు నెల్లలో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. ఛైర్మన్ పదవి కోసం 50, సభ్యుల కోసం 321 దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిని స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ ముగ్గురిలో తెలంగాణకు చెందిన మహేందర్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్నించిన మహేందర్‌రెడ్డి 1968 బ్యాచ్ పోలీస్ సర్వీస్ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులై 2022 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. వృత్తిపరంగా మహేందర్‌రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉన్నది.
నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పనిచేయడానికి అవసరమైన అన్ని అర్హతులు ఆయనకే ఉన్నాయని ప్రభుత్వ భావన అయి ఉంటుంది. అందుకే ఆయనకే సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బాధ్యతను అప్పగించున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ప్రణాళిక, సర్వీస్ కమిషన్ పరిధిలోని ఉద్యోగాల భర్తీకి, వివిధ పరీక్షల ఫలితాలు తదితర అంశాలపై కొత్త బోర్డు ఏర్పాటు అనంతరం స్పష్టత రానున్నది.