Mallikarjun Kharge | మోదీ మళ్లీ గెలిస్తే.. ఇవే చివరి ఎన్నికలు

నరేంద్రమోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో నియంతృత్వాన్ని తీసుకొస్తారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు

  • Publish Date - January 30, 2024 / 05:13 AM IST
  • రష్యాలో పుతిన్‌ తరహాలో నియంతృత్వమే
  • ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి
  • భువనేశ్వర్‌ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

Mallikarjun Kharge | భువనేశ్వర్‌ : నరేంద్రమోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో నియంతృత్వాన్ని తీసుకొస్తారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సోమవారం భువనేశ్వర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఖర్గే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు. ఇకపై ఎన్నికలనేవే ఉండవని అన్నారు. ‘రష్యాలో వ్లదీమిర్‌ పుతిన్‌ అధ్యక్ష ఎన్నిక మాదిరిగానే భారతదేశంలోనూ ఉంటుంది.


రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వారు వారి బలాన్ని ఉపయోగించి దేశాన్ని పాలిస్తారు. ఎన్నికవుతారు.. 200, 300, 400, 500 సీట్లు గెలుచుకుంటారు. ఆఖరుకు 600 సీట్లు కూడా గెలుచుకుంటారు’ అని ఖర్గే చెప్పారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్ర అసెంబ్లీకీ ఒడిశాలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ఒడిశాకు రావడం ఇదే మొదటిసారి. ‘మీరు కోరుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు. కానీ.. బ్రిటిష్‌ పరిపాలనలో బానిసల్లా ఉన్నట్టయితే.. ఇక మీ ఇష్టం’ అని ఖర్గే అన్నారు.


ఎన్డీయే నుంచి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బయటకు వెళ్లిపోవడాన్ని ప్రస్తావించిన ఖర్గే.. జేడీయూ వెళ్లిపోయినంత మాత్రాన ఇండియా కూటమి బలహీనపడబోదని స్పష్టం చేశారు. ‘ఒక వ్యక్తి పోయినంత మాత్రాన దేశం ఎలా బలహీనపడదో.. ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినా కూటమి బలహీనపడబోదు. మరింత బలంగా ముందుకు వస్తాం. ఐక్యంగా పనిచేస్తాం. కేంద్రంలో బీజేపీని, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ను ఓడించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం’ అని ఖర్గే చెప్పారు.


70 ఏళ్లుగా దేశానికి కాంగ్రెస్‌ చేసిన సేవలను విమర్శించడాన్ని ఖర్గే తిప్పికొట్టారు. ‘70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటే అసలు మోదీ ముఖ్యమంత్రి కూడా అయ్యి ఉండేవారేకాదు. మేం దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాం. అందువల్లే నువ్వు (మోదీ) ఈ రోజు ఆ స్థానంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అంతమొందించాలని అనుకుంటున్నావు’ అని ఖర్గే నిప్పులు చెరిగారు.

విభజించి పాలించాలని బీజేపీ, ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి కాంగ్రెస్‌ నాయకులు నిరుపమాన త్యాగాలు చేశారని చెప్పారు.


‘ఆరెస్సెస్‌, బీజేపీ విషం వంటివి. అవి మన హక్కులను ఒకదాని తర్వాత మరొకటి గుంజుకుంటున్నాయి. మహిళల హక్కులు, ఎస్సీలు, ఎస్టీల హక్కులు పోతున్నాయి. మణిపూర్‌లో ఏం జరుగుతున్నది? ప్రజలు హత్యలకు గురవుతున్నారు. మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. వందల వాహనాలు, ఇళ్లు తగులబడిపోతున్నాయి. మోదీ ఎక్కడ? వెళ్లు.. వెళ్లి మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలకు నీ ముఖం చూపించు’ అంటూ ఖర్గే మండిపడ్డారు.


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌.. ఆయన తండ్రి బిజు పట్నాయక్‌ వంటివారు కాదని ఖర్గే విమర్శించారు. ముఖ్యమంత్రిగా బిజు పట్నాయక్‌ రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించారని చెప్పారు. అధికారులతో పరిపాలన చేస్తున్నారని నవీన్‌ పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు చెందిన ఒక అధికారిని (వీకే పాండియన్‌) పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.