Mallu Ravi
విధాత, ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ జాతీయమాజీ అధ్యక్షుడైన రాహుల్‌గాంధీపై అణిచివేత రాజకీయం చేస్తుండటాన్ని నిరసిస్తు ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్‌లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలతో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నామని, ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష జరుగుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రకటించారు.
గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సత్యాగ్రహా దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు. ఈ సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ద్వారా ఐకమత్యంగా ఉండాలని పాదయాత్ర చేశారని, 4500 కిలోమీటర్లు నడిచారని, రాహుల్ గాంధీ భావి ప్రధాని గా ఉంటే మంచిదని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బతీయడానికి బీజేపీ ప్రభుత్వం మోడీని చిన్న మాట అన్నందుకు వేదిస్తున్నారన్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభత్వాన్ని రద్దు చేపించి.. కోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చి ఒక్కరోజులోనే సభత్వం రద్దు చేశారన్నారు. ఇల్లు ఖాళీ చెపించి సెక్యూరిటీ తగ్గించారన్నారు. చిన్న కేసును పెద్దగా చేసి ప్రభుత్వం అండగా నిలబడి అణిచివేయాలని చూస్తున్నారన్నారు. హైకోర్టు లో స్టే ఇవ్వాలన్న అప్పీలును కోర్టు లు కూడా తీసుకోకుండా కింది స్థాయి కోర్టు శిక్షనే పరిగణిస్తున్నాయన్నారు.
ఈ నెల 20న కొల్లాపూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవు తారని, ఈ సభలో జూపల్లి తోపాటు ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి తోపాటు మరికొందరు పార్టీలో చేరనున్నారన్నారు. సభ ఏర్పాట్లపై నిన్న మీటింగ్ పెట్టామని, కొల్లాపూర్ సభ ఖమ్మం సభకంటే విజయవంతం అవుతుందన్నారు.
బిజెపి లో లుకలుకలున్నాయని, కాషాయం పార్టీలో చాలామంది నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. ఎన్ని మాయమాటలు చెప్పిన బిఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మరన్నారు. 100 సీట్లతో రాష్ట్రంలో , 300 సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ లు ఏర్పడనున్నాయన్నారు. ప్రజా ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలన్నారు.