అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన సందర్భంగా దేశవ్యాప్తంగా రామభక్తులు ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అయితే రామాయణానికి సంబంధించిన నాటికలు కూడా ప్రదర్శించి, భక్తులను అలరించారు. అయితే నాటికలో భాగంగా హనుమంతుడి పాత్రను పోషించిన వ్యక్తి గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన హర్యానాలోని భివానీలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామమందిరం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో హర్యానాలోని భివానీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇక రామాయణానికి సంబంధించి ఓ నాటికను కూడా ప్రదర్శించారు. ఈ నాటికలో హరీశ్ మెహాతా అనే వ్యక్తి హనుమంతుడి పాత్ర పోషించాడు. ఈయన గత 25 ఏండ్ల నుంచి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ప్రదర్శన చేస్తున్న సమయంలో హరీశ్ మెహాతా.. ఉన్నట్టుండి వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఆయన కుప్పకూలిపోవడాన్ని నాటికలో భాగమే అని అక్కడున్న వారు అనుకున్నారు. ఎవరూ కూడా అతనికి ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అతను పైకి లేవకపోవడంతో.. చివరకు నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో హరీశ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భివానీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.