ఏ పార్టీలో ఉన్న మాదిగలు బీజేపీకి ఓటు వేయండి: మందకృష్ణ కీలక వ్యాఖ్యలు

పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన

  • Publish Date - March 19, 2024 / 04:58 PM IST

విధాత : పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహాసభ ఏర్పాటు చేసి ప్రధాని మోడీని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని కోరిన మందకృష్ణ ఇందుకోసం బీజేపీకి రాజకీయాలకు అతీతంగా మద్దతునిస్తామని ప్రకటించారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. చెప్పినట్లుగానే ఆయన ఎమ్మార్పీఎస్ సమావేశాల్లో బీజేపీకి ఓటు వేయాలంటూ కోరుతున్నారు. కాంగ్రెస్, బీఆరెస్‌లలో ఉన్నవారందరూ రాజీనామా చేసి బీజేపీలో చేరాలని తాను అనడం లేదని, ఏ పార్టీలో ఉన్నవారు అదే పార్టీలో ఉండాలని, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని పిలుపునిచ్చారు. బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని సూచించారు. అయితే మంద కృష్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. కొందరు ప్రధాని మోదీ ఎంత ప్యాకేజీ ఇచ్చారని మందకృష్ణపై విమర్శలు గుప్పించగా, మరికొందరు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే మాట్లాడారంటూ మద్దతునిస్తున్నారు.

మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మార్పీఎస్ సమావేశంలో మాట్లాడిన మంద కృష్ణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇటీవల ప్రకటించిన పార్లమెంట్, అసెంబ్లీ, స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు జగన్‌ ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దయ్యాయని, ప్రధాని మోదీ మాదిగలను గుర్తించారని, అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీక కూటమికి మద్దతు ఇస్తామని తెలిపారు. త్వరలో కూటమి అగ్ర నేతలను కలిసి మాట్లాడతనని మందకృష్ణ తెలిపారు.