Manipur
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మణిపూర్ రాష్ట్రంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకే ఒక పథకం ప్రకారం హింసను ప్రోత్సాహిస్తున్నారని మణిపూర్ రచయిత్రి కూర్ ఫినా కిమ్ కోవా కోంగ్యాయి అన్నారు. శనివారం హనుమకొండలో భారత్ బచావో సదస్సు వరంగల్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మణిపూర్ లో ఏం జరుగుతోందనే అంశంపై మణిపూర్ రచయిత్రి కూర్ ఫీనా కిమ్ కోవా కోంగ్యాయి మాట్లాడుతూ మణిపూర్ ఎంతో సహజ సంపదలకు నెలవైన రాష్ట్రం అని, ఎత్తైన కొండలు, గుట్టలలో అపారమైన ఖనిజ సంపద ఉందని, వాటిని దోచుకునేందుకు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఖనిజ సంపదను వారికి కట్టబెట్టేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొండలలో నివసిస్తున్న గిరిజనులపై దాడికి ప్రేరేపిస్తున్నదని, అందువల్లనే కుకీ తెగ ప్రజలపై హత్యలు, అత్యాచారాలు పెరిగి పోయాయని చెప్పారు. కుకీ తెగ వాసులు ఈ దేశ పౌరులేనని, మణిపూర్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. మణిపూర్ ప్రజలకు దేశ ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో వివిధ ప్రజా సంఘాల పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
మణిపూర్ అగ్ని విస్తరిస్తోంది
మణిపూర్ లో చెలరేగిన అగ్ని నేడు డిల్లీ చుట్టుపక్కలకు పాకిందని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ఫోరం నాయకులు అన్వరుల్లాఖాన్ సదస్సులో మాట్లాడుతూ అన్నారు. 2024లో బిజెపి అధికారంలోకి వస్తే మనువాద రాజ్యాంగాన్నే అమలు చేస్తుందని, అందుకే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజా ప్రభుత్వాలనే ఎన్నుకునేలా ప్రజలను చైతన్య పరచాలని అన్నారు.
ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిది పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ సదస్సులో భారత్ బచావో జాతీయ కమిటీ సభ్యులు గాదె ఇన్నయ్య, జైసింగ్ రాథోడ్, సిపిఐ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, లాల్-నీల్ మైత్రి వేదిక కన్వీనర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ, వివిధ పార్టీల, సంఘాల నాయకులు ఎం. వెంగళ్ రెడ్డి,ఎస్.రాంబ్రహ్మం, మల్లెల రామనాథం, ఎన్ రెడ్డి హంసా రెడ్డి, బోడ డిన్న, అరసం అద్యక్షులు నిధి, కొర్నేలు, యిర్మీయా, సాదు ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.