Maoists Recruitment | మళ్లీ రిక్రూట్మెంట్ కలకలం..! పట్టుబడిన మావోలలో నల్లగొండ వాసి..!!

Maoists Recruitment తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎంతవరకు కారణం..? ఆనందరావు ఉస్మానియా యూనివర్సిటీలో PHD.. గణేష్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి.. క్యాటరింగ్ ఉద్యోగం విధాత: తెలంగాణ జిల్లాల్లో కొత్తగా మావోయిస్టు పార్టీలో చేరే వారు కరువయ్యారనుకుంటున్న తరుణంలో కొత్త అరెస్టులు వెలుగు చూడడం ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో పాతికేళ్ల విప్లవోద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహించి ఉనికి కూడా లేకుండా పోయిన మావోయిస్టు పార్టీకి దశాబ్ద కాలానికి పైగా […]

Maoists Recruitment | మళ్లీ రిక్రూట్మెంట్ కలకలం..! పట్టుబడిన మావోలలో నల్లగొండ వాసి..!!

Maoists Recruitment

  • తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎంతవరకు కారణం..?
  • ఆనందరావు ఉస్మానియా యూనివర్సిటీలో PHD..
  • గణేష్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి.. క్యాటరింగ్ ఉద్యోగం

విధాత: తెలంగాణ జిల్లాల్లో కొత్తగా మావోయిస్టు పార్టీలో చేరే వారు కరువయ్యారనుకుంటున్న తరుణంలో కొత్త అరెస్టులు వెలుగు చూడడం ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో పాతికేళ్ల విప్లవోద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహించి ఉనికి కూడా లేకుండా పోయిన మావోయిస్టు పార్టీకి దశాబ్ద కాలానికి పైగా కొత్త రిక్రూట్ మెంట్లు లేవు.

అనూహ్యంగా జిల్లాకు చెందిన మునుగోడు మండలం కొరటికల్ గ్రామం చెన్నగోని గణేష్ అరెస్టు కలకలం రేపింది. కొమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం ఆగరగూడ అటవీ ప్రాంతంలో అదే మండలం జిల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనందరావుతో పాటు చెన్నగోని గణేష్ అరెస్ట్ కావడం జరిగింది.

కొమరం భీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కథనం మేరకు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా వారు కొత్త రిక్రూట్మెంట్ కు సహకరిస్తున్నారని, జెలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు హైద్రాబాద్ లో కొనుగోలు చేసి మావోయిస్టులకు అందించేందుకు వెళుతుండగా వాహన తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు.

తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కరువైపోయిందనుకున్న తరుణంలో తాజాగా పార్టీకి చెందిన కొత్త సభ్యులు పోలీసులకు చిక్కడం ఆసక్తి రేపింది. అరెస్ట్ అయిన ఆనందరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి పిహెచ్ డి చదువుతున్నాడు. పిడిఎస్ యు, కుల నిర్మూలన వేదిక కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. హైదరాబాదులో క్యాటరింగ్ బోయ్ గా పనిచేస్తున్నాడు.

చెన్నైలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన గణేష్ హైదరాబాదులో క్యాటరింగ్ ఉద్యోగంలో చేరగా, అక్కడ ఆనందరావుతో ఏర్పడిన పరిచయం అతడిని మావోయిస్టు పార్టీ వైపు నడిపించిందని పోలీసుల కథనం. అనందరావు, గణేష్ ల నేపథ్యం చూస్తే హైదరాబాద్, చెన్నైలో ఉన్నత చదువులు చదివి.. హైదరాబాదులో నివసిస్తున్న వారు.. నేటి యువతకు భిన్నంగా గెరిల్లా విప్లవోద్యమ పార్టీ వైపు ఆకర్షితులు కావడం ఆశ్చర్యకరమే.

తెలంగాణలో ఇటీవల పెరిగిన నిరుద్యోగం, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కకపోవడం, ప్రజాస్వామిక నిరసనలపై పెరిగిన నిర్బంధం వంటి పరిణామాలు యువతను నిరాశ, నిస్పృహకి గురిచేస్తూ వారిని పక్కదారులు పట్టిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి ఆధునిక కాలంలో సాంకేతిక విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగైన తీరు, మారిన యువత జీవన విధానానికి తోడు సాంకేతిక, సమాచార విజ్ఞానంతో గెరిల్లా ఉద్యమాల అణిచివేత సులభతరమైంది. ఈ క్రమంలో వామపక్ష తీవ్రవాద సంస్థలకు కొత్త రిక్రూట్మెంట్లు కరువయ్యాయి.

ఇందుకు భిన్నంగా కొత్తగా తెలంగాణలో మావోయిస్టు Hపార్టీకి చాప కింద నీరులా కొత్త రిక్రూట్మెంట్ దిశగా యువత ఆకర్షింపబడిన తీరుకు ప్రస్తుతం తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎంతవరకు కారణం అవుతున్నాయన్న చర్చను రగిలిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ – చత్తిస్ ఘడ్ సరిహద్దు జిల్లాల్లో మాత్రమే కొత్త రిక్రూట్మెంట్లు, అదే సమయంలో అరెస్టులు కొనసాగుతున్నాయి.

మరో వైపు అటు ఆనందరావు, ఇటు గణేష్ కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లలను అన్యాయంగా పోలీసులు మావోయిస్టు కేసుల్లో ఇరికించారని, వారికి ఏమీ తెలియదని, హైదరాబాదులో చదువుకుంటున్నారని చెప్పడం గమనార్హం.