విధాత: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగినా ఆయన దాన్ని ఖండిస్తూ వచ్చారు. అంతేకాదు మొన్న ఆయన ఢిల్లీకి అందుకే వెళ్లారు అంటే నేను ఢిల్లీకి రావడం కొత్త కాదని. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారంలో నిజంలేదని.. నేను రాజకీయాల్లోనే ఉన్నానని.. రిటైర్ కాలేదని దానికి పెద్ద వివరణ ఇచ్చారు.
అయితే శుక్రవారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. సుమారు 35 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా సంజయ్ శశిధర్‌రెడ్డి కుటుంబ నేపథ్యం గురించి అమిత్ షాకు వివరించారని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన చెన్నారెడ్డి గురించి అమిత్‌కు సంజయ్ తెలిపారు.
ఆయన 28వ తేదీ నుంచి ఐదవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. శశిధర్‌రెడ్డి లాంటి వాళ్లు బీజేపీలో చేరాలనుకోవడం శుభపరిణామం అని వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను హైదరాబాద్‌కు వెళ్లి తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలోనే కాషాయ కప్పుకోనున్నట్లు శశిధర్‌రెడ్డి షాకు చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మన్ పుట్టమధు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తాజాగా శశిధర్‌రెడ్డి లాంటి నేతలు కూడా స్పష్టత ఇచ్చారు. కాంగ్రేస్ పార్టీకి నయం కాని వ్యాది సోకిందని, రేవంత్ రెడ్డి వ్వవహర శైలి బాగలేదని. మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాలాగే చాలా మంది కాంగ్రేస్‌ను వీడి భయటకు వస్తారని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ బలంగా లేని నియోజక వర్గాల్లో అభ్యర్థుల వేటలో పడినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 30-40 స్థానాలు గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.
అలాగే బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య కొంత కాలంగా లిక్కర్ అంశం, ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కు, బండి అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం వంటివి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. నిన్న కవిత బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ మాటల తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలో చలికాలంలో రాజకీయ వేడి రాజుకున్నది.