విధాత: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు (నర్సాపూర్, పటాన్‌చెరు, దుబ్బాక, జహీరాబాద్) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలువడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించిన విషయాలను సీఎంతో చర్చించడానికే భేటీ అయినట్టు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారు. దీనికి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదు అని చెబుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికార, విపక్షపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదని బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు సీనియర్ నేత కడియం శ్రీహరి అంటే మేము తలుచుకుంటే బీఆర్‌ఎస్ మక్కలవుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ చూద్దామన్నా కనిపించదని, ఆపార్టీని వంద మీటర్ల లోతులో పాతిపెడుతామని లండన్‌లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీమంత్రి మల్లారెడ్డి తమ పార్టీపై సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మోడీ మూడోసారి ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ ఏమౌతుందోనని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి కూడాలోక్‌సభ తర్వాత 30 ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జోస్యం చెప్పారు. వీరి వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు స్థానాలకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలన బీఆర్‌ఎస్ అభ్యర్థను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో సంఖ్యాపరంగా చూస్తే ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. అధికారపార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారనే విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఫిరాయింపులు తెరతీస్తే
కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలపై బీఆర్‌ఎస్ నిలదీస్తుండగా.. మేము వందరోజుల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపిస్తామని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో అధికారపార్టీ ప్రవేశపెట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులపై రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. వాళ్ల పాలనలో అన్నిరంగాలు కుప్పకూలాయిని, దివాళా తీశాయని చెప్పుకొచ్చింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇరు పార్టీల మధ్య మాటలు హీటెక్కాయి.
దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారపార్టీ ఆరోపిస్తున్నట్టు మేము ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయలేదని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే అప్పులు చేశామన్నారు. తాము అప్పులు చేసి అభివృద్ధి ద్వారా ఆస్తులు సృష్టించామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ ఫిరాంపులకు పాల్పడితే గతంలో ఏం జరిగిందో తెలుసునని, మావైపు నుంచి అలాంటి చర్యలు ఉండవని, ఒకవేళ ప్రతిపక్షం నుంచి అలాంటివి జరిగితే పరిస్థితి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలుంటాయన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఫిరాయింపుల వ్యాఖ్యలపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్, ఇతర పౌర సంఘాల నేతలు మాట్లాడుతూ ఫిరాయింపులకు ఎవరూ పాల్పడినా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో జరుగుతున్నదనే చర్చ జరుగుతున్నది.
బీజేపీ పాత్రపై అనుమానాలు
తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలు కన్న కమలనాథులకు గతంలో కంటే రెండింతల ఓటు శాతం పెరిగింది. ఒకటి నుంచి వాళ్ల సీట్ల సంఖ్య 8కి చేరింది. కానీ వారు ఆశించిన సీట్లు రాలేదు. రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ రాదని హంగ్ వస్తుందని వాళ్లు అంచనా వేశారు. అప్పుడు తామే కింగ్ మేకర్ అవుతామని కమలనాథులు ఆశపడ్డారు. కానీ ప్రజలు ఆ పార్టీకి అలాంటి అవకాశం ఇవ్వకుండా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు ఎంఐఎం (7), బీజేపీ (8), బీఆర్‌ఎస్ (39) సీట్లన్నీ కలిపితే 54 అవుతాయని ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
బీజేపీకి బీఆర్‌ఎస్, ఎంఐఎం బీ టీమ్‌లు అని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఆరోపించాయి. అవి నిజమే అనేలా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమౌతుందన్నది దానికి కొనసాగింపుగానే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నరేంద్రమోడీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో ప్రజామోదంతో ఎన్నికైన దాదాపు పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల మనుగడపై ఆపార్టీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశం అయ్యాయి. అంతేకాదు ఆ మధ్య ఓ సోషల్ మీడియా ఛానల్‌లో కేసీఆరే తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపి తర్వాత ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తారని ఆరోపించారు. దాదాపు రెండు నెలులుగా రాష్ట్ర రాజకీయాలన్నీ ఫిరాయింపులు, ప్రభుత్వ మనుగడ చుట్టే తిరుగుతుండటం ప్రజాస్వామ్యానికి మంచి కాదని ప్రజాస్వామికవాదులు వాపోతున్నారు. రాజకీయాలు ఇంతలా దిగజారడం, ప్రజా తీర్పునకు విరుద్ధంగా పార్టీలు వ్యవహరించడం ప్రమాదకరం అంటున్నారు.