Medchal |
విధాత: తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. వరుసకు కూతురైన మైనర్ బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తి ఆగడాలు భరించలేని బాధిత మైనర్ బాలిక అతనిపై కర్రతో దాడి చేసి చంపింది. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన జయశ్రీ నాయక్ అనే మహిళ ఉపాధి నిమిత్తం కొన్నేండ్ల క్రితం మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉంటుంది.
అయితే ఆమెకు పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక భర్త లేకపోవడంతో.. జయశ్రీ పద్మనాభ నాయక్ కలిసి సహజీవనం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఆమె కూతురు ఒడిశా నుంచి కండ్ల కోయకు వచ్చింది. వరుసకు కూతురయ్యే ఆ మైనర్ బాలికపై పద్మనాభనాయక్ కన్ను పడింది. దీంతో ఆ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు.
ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం సమయంలో పద్మనాభ నాయక్ పీకల దాకా మద్యం సేవించి, జయశ్రీ ఇంటికి వచ్చాడు. బాలిక ఒంటరిగా ఉండటంతో ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అతన్నుంచి తప్పించుకునేందుకు యత్నించగా, అడ్డుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఒక కర్రతో అతనిపై దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు.
విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన జయశ్రీ, పద్మనాభ నాయక్‌ను చూసి నిర్ఘాంతపోయింది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది బాలిక. అనంతరం పద్మనాభ నాయక్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.