Minister Konda Surekha | ఆనాడు హిమాన్షుకు ఏ హోదా ఉంది?
లిక్కర్ స్కామ్‌లో ఇరికి ప్రజల సొమ్ము దోచుకుని లిక్కర్ రాణిగా పేరొందిన ఎమ్మెల్సీ కవిత సీఎంపై అనుచిత విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు

- ఏ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు?
- లిక్కర్ రాణి కవిత మాట్లాడితే ప్రజలు నవ్వుతారు
- గత బీఆరెస్ ఎమ్మెల్యేలు కబ్జాలకే పరిమితం
- ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రియాంక గాంధీతో రెండు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆనాడు కేసీఆర్ మనుమడైన హిమాన్షు ఏ హోదాలో రాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారో చెప్పాలని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గతంలో అమెరికాలో అంట్లు తోముకునే మీరు మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లిక్కర్ రాణి.. నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు’ అని ఎద్దేవా చేశారు.
గ్రేటర్ వరంగల్లో పలు అభివృద్ధి పనులపై శనివారం సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రితోపాటు వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. తమను విమర్శించే ముందు మీ వీపులను చూసుకోవాలని కవితకు సురేఖ హితవు పలికారు. తమను విమర్శించే అర్హత కవితకు లేదని అన్నారు. కవితకు దమ్ముంటే నిజామాబాద్‌లో మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు.
జ్యోతిరావు ఫూలే గురించి కవిత మాట్లాడటాన్ని సురేఖ ప్రస్తావిస్తూ.. తొమ్మిదిన్నరేళ్లుగా లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా? అని ప్రశ్నించారు.
గత ఎమ్మెల్యేలు కబ్జాలకే పరిమితం
గతంలో బీఆరెస్ ఎమ్మెల్యలు కబ్జాలకు, రౌడీయిజానికే పరిమితం అయ్యారని మంత్రి సురేఖ విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే నిధులను కూడా వాడుకోలేక పోయారని, సీఎంఎఫ్, సీడీఫ్‌లను కూడా వినియోగించుకోలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌పై సవతి తల్లి ప్రేమను చూపుతున్నదని మంత్రి విమర్శించారు.
ఇక గత వరంగల్ ఎమ్మెల్యే రూ.3 కోట్ల నిధులు కూడా వాడుకోలేదని ఎద్దేవా చేశారు. వరంగల్‌ను రెండో అతి పెద్ద సిటీగా తయారు చేస్తామని, వర్థన్నపేటలో నూతనంగా క్రీడలకు గ్రౌండ్‌ను నిర్మిస్తామని చెప్పారు. వరంగల్ బస్టాండ్‌ను కొత్తగా నిర్మిస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.