• Telugu News
  • /Latest

అధికార వికేంద్రీకరణతో ప్రజలకు పాలన చేరువ

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తూ 73,74రాజ్యంగ సవరణలతో అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువ చేశారని, తమ ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Reported by: Somu | latest | Mar 02, 2024, 5:30 am IST
Read Time: 5 mins
అధికార వికేంద్రీకరణతో ప్రజలకు పాలన చేరువ
  • స్థానిక సంస్థలలో ఇబ్బందికర చట్టాలు ఉండవు
  • బీఆరెస్ పాలనలో పంచాయతీరాజ్ సంస్థలు నిర్వీర్యం
  • పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర సదస్సులో మంత్రి పొన్నం


విధాత, హైదరాబాద్‌: దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తూ 73,74రాజ్యంగ సవరణలతో అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువ చేశారని, తమ ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం శంషాబాద్ మల్లికా కన్వేన్షన్‌లో నిర్వహించిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పంచాయతీ రాజ్ సంస్థలలో, మున్సిపాలిటీలలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చట్టాలు ఉంటాయని హామీ ఇచ్చారు.


తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయని అనుకున్నామని, కానీ గత పది సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని, ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలను పటిష్ట పరిస్తే ఇప్పుడు 10 సంవత్సరాలుగా బీఆరెస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో ప్రతినిధులకు సంబంధం లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయని ఆయన మండిపడ్డారు.


గత ప్రభుత్వం సర్పంచ్‌లను, కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టే రీతిలో ఇష్టారాజ్యంగా చట్టాలు తీసుకొచ్చి వేధించిందని దుయ్యబట్టారు. బిల్లులు ఇవ్వకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అప్పుల పాలు చేసిందన్నారు. అటవీ రక్షణ, పర్యావరణ, పారిశుద్ధ్య చర్యలపై మరింత ముందుకు వెళ్లాలని, క్షేత్ర గ్రామీణ స్థాయి సంఘటన్ ద్వారా వికేంద్రీకరణ పాలనా విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.


రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ద్వారా ఎంపీ మీనాక్షి నటరాజన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని పొన్నం తెలిపారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుండి ఎంపిగా అయిన తరువాత నేను కరీంనగర్ నుండి ఎంపీగా ఒకేసారి గెలిచామని, వారు పార్లమెంట్ లో తెలంగాణ కోసం మాకు మద్దతుగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ద్వారా మరింత ముందుకు వెళదామన్నారు. అధికారాలను వికేంద్రీకరణ ద్వారా ముందుకు వెళదామని, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొన్న అందరికి నా సహకారం అందిస్తానన్నారు.