దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కేటీఆర్‌ మాటలు: మంత్రి సీతక్క

సీఎం రేవంత్‌రెడ్డిపైన బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన విమర్శలపై మంత్రి సీతక్క ట్వీటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు

  • Publish Date - January 26, 2024 / 11:10 AM IST

విధాత : సీఎం రేవంత్‌రెడ్డిపైన బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన విమర్శలపై మంత్రి సీతక్క ట్వీటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. కేటీఆఆర్‌..నీ ప్రతిమాట దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని, అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే మీ కుటుంబమేనని, అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారన్నారు. ‘దొర’హంకారానికి ప్రతిరూపం మీ పాలన అయితే..ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం మా పాలన అన్నారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలని బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు.


అంతకముందు కేటీఆర్‌ మాట్లాడుతూ పెద్దలు ఎప్పుడో సుమతి శతకంలో చెప్పిన మాట… కనకపు సింహాసనమున శునకమును కూర్చుని పెట్టినా దాని బుద్ధి మారనట్లుగా, మంచి ముహూర్తాన పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మారరని కేటీఆర్‌ అన్నారు. రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారని, మేము ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారన్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండన్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పడం లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు ఎన్ని చేసిన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతామన్నారు.