ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్నాక‌..హిజ్రాగా మారిన భ‌ర్త‌..మూర్ఛ‌పోయిన భార్య‌

ఓ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్న త‌ర్వాత‌.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత హిజ్రాగా మారి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు

  • By: Somu    latest    Feb 02, 2024 10:44 AM IST
ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్నాక‌..హిజ్రాగా మారిన భ‌ర్త‌..మూర్ఛ‌పోయిన భార్య‌

Karnataka | బెంగ‌ళూరు: ఓ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్న త‌ర్వాత‌.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత హిజ్రాగా మారి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. చివ‌ర‌కు హిజ్రాగా మారిన త‌న భ‌ర్త‌ను చూసి భార్య మూర్ఛ‌పోయింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో వెలుగు చూసింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. రామ‌న‌గ‌ర‌కు చెందిన ల‌క్ష్మణ‌రావు 2015లో పెళ్లి చేసుకున్నాడు. చికెన్ షాపులో ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లైన రెండేండ్ల‌లోనే ఇద్ద‌రు కుమారులకు ల‌క్ష్మ‌ణ‌రావు దంప‌తులు జ‌న్మ‌నిచ్చారు. ఆ త‌ర్వాత ఖ‌ర్చులు పెరిగి అప్పులు ఎక్కువైపోయాయి. దీంతో 2017లో ఇల్లు వ‌దిలి ప‌రార‌య్యాడు. ఇక త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేద‌ని భార్య‌.. ఐజూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అత‌ని ఆచూకీ పోలీసులు కూడా క‌నుక్కోలేక‌పోయారు. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతో ఆమె మ‌నుగ‌డ సాగిస్తోంది.


అయితే ఇటీవ‌ల క‌న్న‌డ బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్ర‌సారాన్ని భార్య టీవీలో చూసింది. ఆ షోలో పాల్గొన్న ఓ వ్య‌క్తిని చూడ‌గానే ఆమెకు అనుమానం క‌లిగింది. ఆ షోలో త‌న భ‌ర్త ఉన్న‌ట్లు ఆమెకు అనిపించింది. దీంతో మ‌రోసారి ఫోన్‌లో బిగ్ బాస్ షో వీడియోల‌ను చూసింది. ల‌క్ష్మ‌ణ‌రావు హిజ్రా రూపంలో ఉన్న‌ట్లు గుర్తించింది ఆమె. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా మ‌ళ్లీ ఐజూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు ద‌ర్యాప్తు చేయ‌గా, బిగ్ బాస్ షోలో నీతు వ‌న‌జాక్షి అనే హిజ్రా పాల్గొన్న‌ట్లు తేలింది. ర‌ష్మిక అనే హిజ్రా తీసిన రీల్స్‌లోనూ ల‌క్ష్మ‌ణ్‌ను పోలిన హిజ్రా క‌నిపించింది.


పుట్టుమ‌చ్చ‌ల‌తో గుర్తించిన భార్య‌..


ఇక ర‌ష్మిక‌ను పోలీసులు సంప్ర‌దించారు. వీడియోలో ఉన్న వ్య‌క్తి ఆచూకీ అడ‌గ్గా, ఆమె పేరు విజ‌య‌ల‌క్ష్మీ అని తెలిపింది. మొత్తానికి విజ‌య‌ల‌క్ష్మీని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఐజూరు పీఎస్‌కు త‌ర‌లించారు. తాను ల‌క్ష్మ‌ణ‌రావు కాద‌ని, విజ‌య‌ల‌క్ష్మీ అని వాదించాడు. కానీ భార్య అత‌ని ఒంటిపై ఉన్న పుట్టుమ‌చ్చ‌ల్ని, ఇత‌ర చిహ్నాల‌ను చూసి అత‌ను ల‌క్ష్మ‌ణ‌రావు అనే గుర్తించింది. చివ‌ర‌కు తాను లింగ‌మార్పిడి చేసుకున్న‌ట్లు ల‌క్ష్మ‌ణ‌రావు ఒప్పుకున్నాడు. దీంతో భ‌ర్త మాట‌ల‌కు భార్య మూర్ఛ‌పోయింది. భార్యాపిల్ల‌ల‌ను వ‌దిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయావ‌ని ప్ర‌శ్నించ‌గా, త‌న‌కు కుటుంబం క‌న్నా, హిజ్రా జీవిత‌మే బాగుంద‌ని బ‌దులిచ్చాడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మ‌ణ‌రావు భార్య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.