MLA Bandla | కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమం

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై బీఆరెస్‌ పార్టీ నిరసన బాట పట్టింది. జూరాల ఆనకట్టపైన రైతులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ధర్నా నిర్వహించారు

  • By: Somu    latest    Feb 03, 2024 12:37 PM IST
MLA Bandla | కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమం
  • ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించడం సరికాదు
  • తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు
  • కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర హక్కులకు కేసీఆరే శ్రీరామరక్ష
  • హామీలను అమలు చేయలేకపోతున్న ప్రభుత్వం
  • దృష్టి మళ్లించేందుకే కృష్ణా జలాల వివాదాలు
  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విమర్శలు
  • జూరాల ఆనకట్టపై బీఆరెస్‌ శ్రేణులతో ధర్నా


MLA Bandla | విధాత : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై బీఆరెస్‌ పార్టీ నిరసన బాట పట్టింది. జూరాల ఆనకట్టపైన రైతులతో గద్వాల నియోజకవర్గం బీఆరెస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించడంతో రాష్ట్ర రైతులకు, ప్రజలకు సాగుతాగునీటి కష్టాలు ఏర్పడే ప్రమాదముందన్నారు. ప్రభుత్వ చర్య తెలంగాణ నదీ జలాల హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టడమేనని విమర్శించారు.


వెంటనే ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల రక్షణకు, కృష్ణా బేసిన్‌లో తెలంగాణ హక్కులకు కేసీఆర్ ఒక్కరే శ్రీరామరక్ష అన్నారు. మరోసారి కృష్ణా జలాలపై హక్కుల కోసం ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడుతున్నదని చెప్పారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారీతిన ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిల పడుతోందని అన్నారు. ప్రజలను హామీల నుంచి దృష్టి మళ్లించేందుకే కృష్ణా జలాల వివాదాలను సృష్టిస్తున్నట్లు అర్థమవుతున్నదని విమర్శించారు.


జలాల్లో అన్యాయంతోనే తెలంగాణ ఉద్యమం


ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని కృష్ణమోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రధానంగా కరువు ప్రాంతమైన పాలమూరు జిల్లాకు తలాపునే కృష్ణా నది ప్రవహిస్తున్నా సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో పల్లేర్లు మొలిచాయన్నారు. కరువును పారదోలేందుకు బీఆరెస్‌ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం చేపట్టిందని చెప్పారు.


ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలపై హక్కులను ఏపీకి, ప్రాజెక్టులపై అధికారం కేంద్రానికి అప్పచెబుతోందన్నారు. ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకునేందుకు 2021లో కేంద్రం గెజిట్ జారీచేసి, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అప్పగించాలని ఒత్తిడి పెంచిందని, అయితే దీనికి అప్పటి సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతి క్షణం గుర్తుచేస్తూ కేంద్రాన్ని కట్టడి చేశారన్నారు. ప్రాజెక్టులు అప్పగిస్తే కీలకమైన విద్యుత్తు ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మన లిఫ్టులు నడవాలంటే కరెంటు కావాలన్నారు.


కృష్ణా బేసిన్‌కు నీటి కష్టాలు


ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ లెక్కలేనంత నీరు తరలించుకుపోతుంటే ఇక్కడ కృష్ణా బేసిన్‌లో ఉన్న పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని, కృష్ణా బేసిన్ అవతలి ప్రాంతంలోని ఆయకట్టుకు ఏపీ బలవంతంగా నీటిని తరలిస్తోందని ఎమ్మెల్యే బండ్ల ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతతో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాకే అతిపెద్ద కష్టం వచ్చి పడిందన్నారు. ప్రస్తుతం ఉన్న జూరాల జలాశయం కింద అతి తక్కువ ఆయకట్టుకే సాగునీరు అందుతుందని తెలిపారు.


అందుకే బీఆరెస్‌ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసిందని, దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టి మొదటి దశ ఎత్తిపోతను విజయవంతంగా కేసీఆర్ ప్రారంభించారని, దాదాపు 80 శాతం పనులు ఈ ప్రాజెక్టు కింద పూర్తయ్యాయన్నారు. కృష్ణా జలాల రక్షణకు, కృష్ణా బేసిన్‌లో తెలంగాణ హక్కులకు కేసీఆర్ ఒక్కరే శ్రీరామరక్ష అన్నారు. మరోసారి కృష్ణా జలాలపై హక్కుల కోసం ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడుతున్నదని చెప్పారు.