త‌ప్పుల త‌డ‌క‌గా శ్వేత‌ప‌త్రం.. కాంగ్రెస్ లెక్క‌లు శుద్ద త‌ప్పు : హ‌రీశ్‌రావు

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు

త‌ప్పుల త‌డ‌క‌గా శ్వేత‌ప‌త్రం.. కాంగ్రెస్ లెక్క‌లు శుద్ద త‌ప్పు : హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారని తెలిపారు. ఈ లెక్కలు శుద్ద తప్పు అని హరీశ్‌ రావు కొట్టిపారేశారు. కావాలంటే దీనిపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు.


మొత్తం లెక్కలు తీసి.. నిజానికి ఎంత ఖర్చయ్యిందో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. రిటైర్డ్‌ అధికారి.. సస్పెండ్‌ అయిన ఏపీ అధికారులతో ప్రిపేర్‌ చేయించారని అన్నారు. ఆ వివరాలు, వాస్తవాలను అవసరం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడారు.


ఈ మొత్తం రిపోర్టు చూస్తే.. ఏ అంశాల్లో గత ప్రభుత్వాన్ని తప్పు పట్టొచ్చో.. ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నామో చూపించాలో.. తమకు కన్వినెంట్‌గా ఉన్న దాన్ని బట్టి రెడీ చేయించినట్లు కనబడుతుందని హరీశ్‌రావు అన్నారు. గత పదేండ్లలో చాలా రంగాల్లో ప్రగతి సాధించిందని. అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నామని తెలిపారు. కానీ వాటిని ఈ రిపోర్టులో చూపించకుండా.. తమకు కన్వినెంట్‌గా తయారు చేయించారని విమర్శించారు.


‘సాధారణంగా అప్పులను డెడ్‌ టు జీఎస్‌డీపీ రేషియో చూస్తాం.. కానీ ఈ టేబుల్‌ను ఇందులో పెట్టకుండా డెడ్‌ టు రెవెన్యూ రిసిప్ట్‌ను చూపించారు. జాతీయంగా అయినా.. అంతర్జాతీయంగా అయినా అప్పులను డెడ్‌ టు జీఎస్‌డీపీ రేషియోలో కొలుస్తారు. కానీ ఇందులో ఆ టేబుల్‌ను ఎక్కడా చూపించలేదు. అది కూడా ఒక కరోనా సంవత్సరాన్ని తీసుకుని.. దాని ప్రకారం చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రిజర్వ్‌ బ్యాంక్‌ లెక్కల ప్రకారం.. డెడ్‌ టు జీఎస్‌డీపీ రెషియో చూస్తే అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింద నుంచి ఐదో స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే 22 స్థానాలు తెలంగాణ కంటే ఎక్కువగా తీసుకున్నాయి. మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో 2022-23 నాటికి 537013 కోట్ల అప్పు.. కర్ణాటక కూడా 535157 కోట్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ చూయించకుండా.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.’ అని హరీశ్‌రావు అన్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిదేండ్లలో 3,36,916 కోట్ల రూపాయల క్యాపిటల్‌ ఎక్సపెండిచర్‌ జరిగిందని.. కానీ దీన్ని ఆ రిపోర్టులో చూపించే ప్రయత్నం చేయరని హరీశ్‌రావు అన్నారు. ఇవాళ ఎంత క్యాపిటల్‌ ఎక్సపెండిచర్‌ జరిగింది? ఈ డబ్బంతా ఎటు పోయింది? అంటే రేపటి రాష్ట్ర అవసరాల కోసం.. రేపటి భవిష్యత్తు తరాల కోసం ఆస్తుల కల్పన చేసే ప్రయత్నం చేశామని వివరించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ జరిగిందని ఆ నివేదికలో చూపించలేదన్నారు. పక్షపాత నివేదికను చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు.


రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో దేశానికే తలమానికంగా తెలంగాణను నిలిపామని హరీశ్‌ రావు తెలిపారు. కానీ దాన్ని ఇందులో చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆదాయం ఎట్ల పెరిగింది? ఆస్తుల కల్పన ఎట్ల పెరిగింది? క్యాపిటల్‌ ఎక్సపెండిచర్ ఎలా చేశాం? అనేవి చూపించకుండా.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విషయంలో 2014-15లో రాష్ట్ర బడ్జెట్‌లో 2,432 కోట్లు ఉంటే.. ఈ ఏడాది బడ్జెట్‌లో 12,161 కోట్లు కేటాయించామని తెలిపారు. అంటే వైద్య, ఆరోగ్య రంగంలో బడ్జెట్‌ దాదాపు 6 రెట్లు పెంచి అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు.


దివాళా.. దివాళా.. ఇదేం దిక్కుమాలిన ప్ర‌చారం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్‌రావు ఫైర్



రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా, ఆరోగ్యకరంగా ఉందని.. అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చిచెబుతుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తుందని తద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ, పరపతి, ప్రతిపత్తిని, భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతుందని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రంపై హ‌రీశ్‌రావు అన్నారు.


ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే దాని పర్యవసనాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. ఇది కూర్చున్న కొమ్మనే నరుక్కునేటువంటి అవివేకమైన చర్య అని అన్నారు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే.. మార్కెట్‌లో తెలంగాణకు ఏర్పడిన విశ్వసనీయత దెబ్బతింటుందని.. పెట్టుబడులు రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఇచ్చే 3 శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి. మన బాండ్లకు డిమాండ్‌ తగ్గుతుందని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.


దివాళా.. దివాళా అని రాష్ట్ర ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే.. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. దివాళా తీసిన రాష్ట్రం నీళ్లు ఇవ్వగలదా? కరెంటు ఇవ్వగలుగుతుందా? అనే అపోహలు తలెత్తుతాయన్నారు. పర్యవసనంగా పెట్టుబడులు ఆగి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇదే గోబెల్స్‌ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసం.. మాపై బురదజల్లే ప్రయత్నం చేశారని అర్థం చేసుకుంటాం.. కానీ ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం, అన్యాయం, మూర్ఖత్వం అని హ‌రీశ్‌రావు అభిప్రాయపడ్డారు.


‘నూతనంగా ఏర్పడిన రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకుని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్ర వివక్షను తట్టుకుని.. సొంత వనరులను సమీకరించుకుని.. అద్భుతమైన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైన తరుణంలో.. రాష్ట్రంలో ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగిన సమయంలో కూడా.. ఆ సంవత్సరం వానకాలం పంట కోసం రైతుబంధు సహాయాన్ని సీజన్‌ కంటే ముందే అందించాం’ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆ ఒక్క సంవత్సరమే కాదు.. ఇప్పటివరకు రైతుబంధు సాయాన్ని ఎప్పుడు కూడా పంటకాలానికి ముందే రైతులకు ఉపయోగపడేలా అందజేశామని గుర్తు చేశారు. దాదాపు 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద.. సకాలంలో నగదు బదిలీ చేసి రైతుల పట్ల ఉన్న ప్రేమను చూపించామని మాజీ మంత్రి తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పరపతిని పెంచామని హరీశ్‌ రావు అన్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లే ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని.. కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాళా రాష్ట్రంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు విడుదల చేస్తున్నది శ్వేత పత్రాలా? లేక మీరిచ్చిన హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలా? అని అనుమానం కలుగుతుందన్నారు.


మ్యానిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల అంతర్యం అని చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. అయినా శ్వేతపత్రాల్లో చెప్పిన వివరాలేవీ కొత్తవేమీ కావని అన్నారు. కొండను తవ్వి ఎలుకను బట్టినట్టు కొత్తగా చెబుతున్నారు.. కానీ దీనిపై ఇదే శాసనసభలో చర్చించామని గుర్తు చేశారు. మామీద బురదజల్లే ప్రయత్నం తప్ప.. ఇందులో కొత్త విషయాలేమీ కనిపించడం లేదని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.