MLA Harish Rao | ఝూటా సీఎం.. రేవంత్‌ది మితిమీరిన అహంకారం
రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు చూసి ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటారా అని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని హరీశ్‌రావు అన్నారు

- కేసీఆర్ సంతకాలు చేశారనడం అబద్ధం
- రేవంత్‌రెడ్డిది మితిమీరిన అహంకారం
- అసహ్యించుకుంటున్న రాష్ట్ర ప్రజలు
- ప్రాజెక్టులు అప్పగించిన రేవంత్ సర్కార్
- మీడియా భేటీలో హరీశ్‌రావు ఫైర్
విధాత: రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు చూసి ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటారా? అని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటల్లో మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధ సత్యాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి, వితండవాదం కనిపించాయని ఆరోపించారు. ఉదయాన పద్మ అవార్డులకు జరిగిన సన్మాన సభలో ప్రముఖుల సమక్షంలో తాను ఇక ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ప్రజలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. సాయంత్రం అయ్యేసరికి చాలా నీచమైన పద్ధతిలో కేసీఆర్ పట్ల వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట తీరు ఏమిటన్నది, మాట ఇస్తే నిలుపుకొనే తీరు ఏమిటన్నది రెండూ తేలిపోయాయని అన్నారు. తెలంగాణ సాధించిన, తొలి సీఎం మీద నీచమైన పద్ధతిలో రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు.
ఇలా రాగానే అలా అప్పగించారు
‘ప్రాజెక్టుల విషయంలో మీరెన్ని మాటలు చెప్పినా పదేండ్లలో కేసీఆర్ ఆ ప్రాజెక్టులను అప్పగించలేదే సారాంశం. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వంలోకి రాగానే అలా అప్పగించేసింది. ఇది మీరు ఎంత దాచేసినా దాగని సత్యం’ అని హరీశ్ వ్యాఖ్యానించారు. కేఆర్‌ఎంబీ రెండు సమావేశాలు అయ్యాయని, వీటి మినిట్స్ ప్రకారం, నెల రోజుల్లో అప్పగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని ఆరోపించారు. సీఆర్పీఎఫ్ అనుమతితో ప్రాజెక్టుల వద్దకు ఇంజినీర్లు వెళ్ళాలని అందులో ఉన్నదని హరీశ్‌రావు తెలిపారు. దీనిని రెండు రాష్ట్రాలు పాటించాలని కూడా మినిట్స్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. పత్రికలు కూడా ఇదే రాశాయన్న హరీశ్.. వాటిని రేవంత్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని నిలదీశారు.
నేను ప్రశ్నిస్తేనే కదలిక
ఇంత అన్యాయం జరిగితే ఏం చేస్తున్నారని తాను ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నిస్తే కదలిక వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పు లేదని మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రాజెక్టులు అప్పగించిందుకు ఒప్పుకొన్నది మీరు కాదా? అని అడిగారు. ప్రాజెక్టులు అప్పగించింది నిజం కాకుంటే ఉద్యోగులు, వారి జీతాల చెల్లింపుల దాకా ఎందుకు చర్చ వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్న హరీశ్‌రావు.. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపటం సరికాదని హితవు పలికారు.
పచ్చి అబద్దం
కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారనడం పచ్చి అబద్ధమని హరీశ్‌రావు అన్నారు. ఇంతకంటే ఝూటా సీఎం ఉంటారా? ప్రశ్నించారు. సీఎం మాటలను జర్నలిస్టులు చెక్ చేసుకుని రాయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పచ్చి అబద్ధాలు సచివాలయంలో కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. దగుల్బాజీతనాన్ని ప్రజలు సహించరని, రేవంత్ చెబుతున్న అబద్ధాలను ప్రజలు, మేధావులు గుర్తించాలని కోరారు.
పదవులకు ఆశ పడి..
పోతిరెడ్డి పాడు విషయంలో పదవులకు ఆశపడి పెదవులు ముసుకున్నది మీ పక్కన ఉన్న నాయకులేనని హరీశ్‌రావు అన్నారు. ఆనాడు మాతో గొంతు కలిపింది కాంగ్రెస్‌లో ఉన్న పీ జనార్దన్‌రెడ్డి ఒక్కరేనని గుర్తు చేశారు. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీదని రేవంత్‌ను ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు? ఎవర్ని చెప్పులతో కొట్టాలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. సబ్జెక్ట్ లేక బూతులతో బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోమన్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. అఖిల పక్షం తీసుకెళ్తే తామూ వస్తామన్నారు.