విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ఎందుకు వేశామని జనం బాధపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. దేశంలో బీఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు ఇచ్చిన ఏకైక రాష్ట్రమన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జనగామ నియోజకవర్గ బీఆరెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ఈసందర్భంగా హారీష్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ వచ్చాకే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని విమర్శించారు.
ఇప్పటికే 60 రోజులు గడిచిపోయాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూఎన్నికల్లో గెలుపు, ఓటమిలు సహజమన్నారు. గెలిచినా, ఒడినా పార్టీని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎవరు ప్రవేశపెట్టలేదన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేసి నియోజకవర్గంలో సాగు నీరు అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత పోరు మొదలైందన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని కోరారు. ఉద్యమకారులైన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా కమిటీలు పటిష్టం చేసి, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ఇంచార్జి జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి, జనగామ నియోజకవర్గ బీఆరెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.