మేం ఫైటర్స్.. ఉద్యమాలు మాకు కొత్తకాదు
మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఫైటర్స్ అని,మాకు ఉద్యమాలు కొత్తకాదని, రైతాంగ హక్కుల సాధనకు పేగులు తెగే దాకా కొట్లాడుతామని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు

- తెలంగాణ రైతాంగ హక్కుల సాధనకు పేగులు తెగేదాక కొట్లాడుతాం
- నల్లగొండలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి
- 13న నిర్వహించే బహిరంగ సభకు స్థల పరిశీలన
విధాత : మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఫైటర్స్ అని, మాకు ఉద్యమాలు కొత్తకాదని, తెలంగాణ రైతాంగ హక్కుల సాధనకు పేగులు తెగే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలో ఈ నెల 13న బీఆరెస్ నిర్వహించనున్న కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ స్థల ఏర్పాట్లను ఆయన సహచర పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ యాక్ట్ లు, నిర్బందాలు సంకెళ్లు మాకు కొత్త కాదని, పెద్ద పెద్ద రాకాసులతోనే కొట్లాడినోళ్లమని, ఈ చిన్న చిన్న రేవంత్, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు మాకు లెక్క కాదని, ఆరునూరైన నల్లగొండ సభ నిర్వహించి తిరుతామన్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులు భాగోతం అంతా బట్టబయలు చేస్తామన్నారు. ప్రాజెక్టుల అప్పగింతతో సాగర్ ఆయకట్టు రైతాంగం మనోవేదనకు గురవుతున్నారన్నారు. చేజేతులా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన నిచులు కాంగ్రెస్ వాళ్లని దుయ్యబట్టారు. మళ్ళీ మాపై ఎదురు దాడి చేస్తూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారన్నారు. కేంద్రం నుంచి ఎదో ఆశించే కాంగ్రెస్ వాళ్ళు ప్రాజెక్టులను అప్పజెప్పారని, సాగర్ డ్యామ్ పై కేంద్ర బలగాలు మోహరించాయని, కాలు కూడా పెట్టనివ్వడం లేదన్నారు.
ఉత్తమ్ లాంటి వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అవగాహన లేదన్నారు. విజ్ఞానం లెనోళ్లు కాంగ్రెస్ వాళ్లని, కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదని, పోలీసులతో రాజ్యం నడపాలని చుస్తే పతనం తప్పదన్నారు. పోలీసులు అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడితే ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జగదీశ్‌రెడ్డి వెంట జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, ఆర్.రవీంద్రకుమార్, పార్టీ నాయకులు రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్, సైదిరెడ్డి,శరణ్య రెడ్డి, దేవేందర్ తదితరులు ఉన్నారు.

అవినీతి కంపనీలకు పనులా
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అవినీతి కంపనీలకు అభివృద్ధి పనులు కట్టబెడుతుందంటూ బీఆరెస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ హర్షద్ మెహతా లాగా రేవంత్ రెడ్డి ఫ్రాడ్ కంపెనీలు తెస్తున్నాడని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఆంధ్రాకి ఇంటర్నేషనల్ ఫ్రాడ్ కంపెనీని తెస్తే ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణకు అలాంటి కంపనీలే తెస్తున్నాడని ఆరోపించారు. 3000 కోట్ల రూపాయల ఎగవేత కేసులో లుక్ ఔట్ నోటీస్ ఇచ్చిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కంపెనీకి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును టెండర్ లేకుండా ఇస్తున్నారని ఆయన తప్బుట్టారు. ప్రభుత్వం ఇకనైనా అలాంటి అవినీతి కంపనీల పట్ల అప్రమతంగా ఉండాలని డిమాండ్ చేశారు.