విధాత: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు ఆలస్యంగా విచారణ జాబితాలో చేరడంతో కోర్టు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవిగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేదన్నారు. కేసు వివరాలను సీఎం మీడియాకు తెలిపారని బీజేపీ తరఫున న్యాయవాది జఠ్మలానీ కోర్టు దృష్టికి తెచ్చారు. కేసు వివరాలు, ఆధారాలు సీఎం స్వయంగా లీక్ చేశారని తెలిపారు. మీడియాకే కాదు.. జడ్జిలకు కూడా పంపారని జస్టిస్ రవాయ్ అన్నారు.
కేసుకు సంబంధించి తమ వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని, సీబీఐ, ఈడీ కూడా ప్రతిరోజూ లీకులు ఇస్తున్నాయని దవే తెలిపారు. కేంద్రంలోని అధికారపార్టీకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయన్నారు. కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నదని. కేంద్రం పర్యవేక్షణలోని సీబీఐ సంస్థ బీజేపీపై ఎలా విచారణ చేస్తుందని దవే ప్రశ్నించారు. కేసుకు సంబంధించి తమకు ఎక్కువ సమయం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. దీంతో ఈ నెల 27న కేసు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసును దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను రద్దు చేస్తూ, ఆ బాధ్యతను సీబీఐకి ఇస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి గత ఏడాది డిసెంబర్ 31న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన అనంతరం సీబీఐ మొదటి సారి తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్‌ఐఆర్ వివరాలు సమర్పించాలని లేఖ రాసింది. అయితే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సీబీఐ ఎదురుచూసింది.
ఆ తర్వాత పలు సందర్భాల్లో మొత్తం ఆరుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌ఐఆర్ వివరాలు సమర్పించాలని లేఖలు రాసినా కేసు అప్పీళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. సీబీఐ నుంచి కేసు వివరాలకు సంబంధించి ఒత్తిడి పెరగడంతో సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థను తిరస్కరించడంతో అక్కడ కూడా చుక్కెదురైంది.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టు వెళ్లాలని సూచించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించి ఈ పిటిషన్ విచారణను అత్యవసరంగా ఈ నెల 13నే విచారించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ప్రస్తావించినా అంగీకరించలేదు. సీబీఐ కేసు దర్యాప్తు చేపడితే పిటిషన్ నీరుగారిపోతుందని, ఫైళ్లు వాళ్ల వెళితే కేసులో ఏమీ మిగిలి ఉండదని ధర్మాసనానికి నివేదించినా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
ఫైళ్లు ఇవ్వక తప్పదా?
ఈ కేసు దర్యాప్తు కోసం దూకుడుగా ఉన్న సీబీఐ తర్వాత ఏం చేయబోతున్నది? ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ వివరాలు ఇవ్వాలని లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాజాగా కేసును సుప్రీంకోర్టు 27కు వాయిదా వేసినా 13న విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన ఫైళ్లు సీబీఐకి ఇచ్చినా వెనక్కి తెప్పించవచ్చు అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వం సీబీఐకి ఎఫ్‌ఐఆర్ వివరాలు ఇవ్వక తప్పదేమో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ కేంద్రం పరిధిలో ఉంటుంది కనుక ఈ కేసును నీరుగారుస్తారన్న భయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకే కేసు సీబీఐకి వెళ్లటాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.