BJP |
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆ నియోజకవర్గంలో నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసేది ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ను బీజేపీ కొద్ది నెలల క్రితం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను తొలగించడంపై జాప్యం కొనసాగుతూనే ఉంది. అయితే గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ విక్రమ్ గౌడ్‌తో సమావేశమై గోషామహల్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. గోషామహల్ సీటు తనదే అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరుతానని తెలిపారు. తమ కుటుంబానికి గోషామహల్ ప్రజలతో 40 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ అంశం అధిష్టానం పరిధిలో ఉంది. ఆయన సేవలు పార్టీకి అవసరం.. ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు.
రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తేయడం లేదు..?
రాజాసింగ్ సస్పెన్షన్‌పై జాప్యానికి ప్రధాన కారణం.. ఆయన గోషామహల్ స్థానాన్ని ఖాళీ చేయకపోవడమే నని వార్తలు షికారు చేస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు రాజాసింగ్ ఒప్పుకోవడం లేదని సమాచారం.
తాను గోషామహల్ నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ్నుంచి వెళ్లే ప్రసక్తే లేదని రాజాసింగ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఒప్పుకుంటేనే సస్పెన్షన్ తొలగించే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం రాజాసింగ్‌కు చెప్పినట్లు సమాచారం. గోషామహల్‌ను విక్రమ్ గౌడ్‌కు వదిలిపెట్టాలని రాజాసింగ్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే పార్టీ అధిష్టానం డిమాండ్‌కు రాజాసింగ్ అంగీకరించలేదని, గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్‌కు మంచి పట్టుంది. మద్దతుదారులు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆయనకు సూచించినట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలుపొందిన ఏకైక వ్యక్తి రాజాసింగ్ మాత్రమే.