CBIకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలన్నీ విఫలం.. తన మెడకే చుట్టుకుంటుందా?

హైకోర్టు ధర్మానసం తాజా తీర్పుపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం విధాత‌: సంచ‌లనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును అత్య‌వ‌స‌రంగా విచారించ‌డానికి సుప్రీం నిరాక‌రించింది. దీంతో సీబీఐ ఈ కేసు ద‌ర్యాప్తుపై దూకుడు పెంచింది. ఫైళ్ల‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని సిట్‌ను లేఖ రాసింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్డి తీర్పు ఇచ్చిన‌ప్ప‌టి […]

  • Publish Date - February 10, 2023 / 10:04 AM IST
  • హైకోర్టు ధర్మానసం తాజా తీర్పుపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం

విధాత‌: సంచ‌లనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును అత్య‌వ‌స‌రంగా విచారించ‌డానికి సుప్రీం నిరాక‌రించింది. దీంతో సీబీఐ ఈ కేసు ద‌ర్యాప్తుపై దూకుడు పెంచింది. ఫైళ్ల‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని సిట్‌ను లేఖ రాసింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్డి తీర్పు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి విచార‌ణ‌ను అడ్డుకోవ‌డం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.

సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలంటూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి సింగిల్‌ జడ్జిని అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థను గ‌త‌వారంలో హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అడ్వకేట్ జనరల్‌ బి.ఎన్‌. ప్రసాద్‌ ఈ కేసు గురించి ధర్మాసనం ముందు ప్రస్తావిస్తూ.. సింగిల్‌ జడ్జి వద్ద స్టే కోసం దరఖాస్తు దాఖలు చేశామని.. దానిపై విచారించడానికి అనుమతించాలని కోరారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీలతో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని, కేవలం విచారణార్హతపైనే నిర్ణయించి అప్పీళ్లను కొట్టివేసిందని తెలిపింది. ఒకసారి సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీలు దాఖలు చేసిన తర్వాత.. ఏ కారణం చేత అయినా ఒకసారి కొట్టివేశాక అదే పిటిషన్‌పై విచారించే పరిధి సింగిల్‌ జడ్జికి ఉండదని ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో కూడిన‌ ధర్మాసనం పేర్కొన్నది. మా తీర్పుపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని బుధవారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ప్రస్తావించారు. దీనిపై స్పందించన ధర్మాసనం ఈ నెల 17వ తేదీన చేపడుతామని బదులిచ్చింది. 13ననే చేపట్టాలని లూథ్రా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

కేసును సిబీఐకి అప్పగిస్తూ గత డిజెంబర్‌లో హైకోర్టులో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తే ఆ పిటిషన్‌ ను కొట్టివేసింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం తీర్పును కొంతకాలం నిలివివేయాలని, సీబీఐ రంగంలోకి దిగకుండా చూడాలని మేం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సీబీఐ కేసు దర్యాప్తును చేపడితే పిటిషన్‌ నీరుగారిపోతుంది.

అందుకే వెంటనే విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై మీరు సుప్రీంకోర్టుకు రాకుండా డివిజన్‌ బెంచ్‌కు ఎందుకు వెళ్లారని సీజేఐ ప్రశ్నించారు. నిందితుల రిమాండ్‌, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసును సత్వరమే విచారించాలని, సీబీఐ చేతికి ఫైళ్లు వెళితే కేసులో ఏం మిగిలి ఉండదని ధర్మాసనానికి నివేదించారు. సీబీఐ నుంచి ఫైళ్లను వెనక్కి తెప్పించవచ్చని సీజేఐ వ్యాఖ్యానించారు.

స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ బ్యూరో ఇన్వెస్ట్‌గేషన్‌గా, బీజేపీ హయాంలో ఆ ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేశారు. కానీ ఈ కేసులో్ నిందితులుగా ఉన్నవాళ్ల విజ్ఞప్తి, బీజేపీ నేతల డిమాండ్‌ చేసిన విధంగానే సీబీఐ చేతిలోకి వెళ్లడం దాదాపుగా ఖరారైంది. అందుకే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి చేతికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఈ కేసు దర్యాప్తు ఈ కేసు ద్వారా బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్న బీఆర్‌ఎస్‌ అధిష్ఠాన ఆలోచన తిరిగి వారికే బూమ్‌రాంగ్‌ అయ్యిందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.

ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను రద్దు చేస్తూ ఈ బాధ్యతను సీబీఐ అప్పగిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించగానే సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టే దిశగా వేగం పెంచింది. గత ఏడాది డిసెంబర్‌ 31న మొదటిసారి ఎఫ్‌ఐఆర్‌ వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జనవరి 5, 9, 11 16 తేదీల్లోనూ లేఖలు రాసింది.

తాజాగా కేసు వివరాల కోసం ఆరోసారి లేఖలు సంధించింది. హైదరాబాద్‌ కేంద్రంగానే దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. దీంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో కలవరం మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఈడీ అభియోగ పత్రంలో ఎమ్మెల్సీ కవిత పేరుతో రెండోసారి ప్రస్తావించింది.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా సీబీఐకి చేతికి వెళ్తే రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో? ఎవరి మెడకు ఈ ఉచ్చు బిగుసుకుంటుందో అనే ఆందోళన బీఆర్‌ఎస్‌ నేతల్లో మొదలైనట్టు సమాచారం.