పార్టీ ఫిరాయిస్తే మరి జరిగేది ఇదే!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గ ప్రజలు ఝలక్ ఇచ్చారు

విధాత : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గ ప్రజలు ఝలక్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 18 ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ 12 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఘోర పరాజయం పాలయ్యారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. ఆసిఫాబాద్ నుంచి గెలుపొంది బీఆర్ఎస్‌లో చేరిన ఆత్రం సక్కుకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కోవా లక్ష్మీ విజయం సాధించారు.
ఇక నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, తాండూర్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియా నాయక్, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర్ రావు, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, పినపాక నుంచి రేగా కాంతారావు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చర్యలు ఎలా ఉంటాయనే దానికి ఓటర్లు సమాధానం ఇచ్చారు