విద్యార్థినుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలి: ఎమ్మెల్సీ కవిత
ఇటీవల ఎస్సీ హాస్టల్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన భవ్య, వైష్ణవి విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు

విధాత: ఇటీవల ఎస్సీ హాస్టల్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన భవ్య, వైష్ణవి అనే విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ వెళుతూ మార్గమధ్యలో భువనగిరిలోని ఎస్పీ హాస్టల్ ను కవిత సందర్శించారు. విద్యార్థినుల మృతి పై ఆరా తీశారు. అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు భవ్య, వైష్ణవి అనే పదవ తరగతి విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై సమగ్ర దర్యాప్త జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
బాధితులు చెబుతున్న విషయాలను, వారి అనుమానాలను పోలీసులు పరిగణలోకి తీసుకోవాలని కవిత పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిలకు వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. విద్యార్థినులు ఆత్మహత్య ఘటన బాధాకరమన్నారు. నిందితులు ఎవరో తేల్చాలి… వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్లో చొరబడ్డారని చెప్తున్నారని, వాటిని పోలీసులు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. హాస్టల్స్ లో సెక్యూరిటీ పెంచాలని కోరారు. శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు.
బాల్క సుమన్‌పై కాదు..రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలి
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని కవిత మండిపడ్డారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందన్నారు. సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.