విధాత, హైదరాబాద్ : గోవా ఎన్నికల్లో ఆప్‌కు ఇచ్చిన వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ డబ్బును ఎవరెవరు డబ్బు సమకూర్చారు? అంటూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకున్న ఈడీ ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. సీసీ కెమెరాల మధ్య విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్‌పై పలు ప్రశ్నలు సంధించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని రెండు బృందాలు ఆమెను సాయంత్రం 5గంటల వరకు విచారించాయని సమాచారం. ఆధారాలు చూపుతూ కవితను ప్రశ్నించిన అధికారులకు ఆమె కొన్ని సార్లు స్పందించగా, కొన్నిసార్లు మౌనం దాల్చారని తెలిసింది. లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన 192 కోట్ల రూపాయలను ఎలా ఇన్వెస్ట్ చేశారని కవితను ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమయంలో కవిత కొనుగోలు చేసిన వివిధ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆమె ముందు ఉంచారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 192 కోట్ల వ్యవహారాన్ని తేల్చాల్సి ఉందన్న ఈడీ ఇదే కోణంలో కవితను ప్రశ్నించింది. సోమవారం సహ నిందితులతో కలిసి ఆమెను విచారించే అవకాశముంది. ఇదిలా ఉంటే.. కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్ రావు ఆదివారం కలిశారు. కవిత యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పారు. కవితను కలిసివారిలో జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. విచారణ అనంతరం ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కవిత కలుసుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించిన విషయం తెలిసిందే. మరోవైపు కవిత భర్త అనిల్, ఆమె పీఏ సహా ఐదుగురికి సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీస్‌లు జారీ చేయడంతో వారంతా ఢిల్లీకి చేరుకున్నారు. కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు న్యాయవాదులను కేటీఆర్ కలిసి, చర్చించారు. కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్‌కుమార్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.