అత్యంత పొడవైన సముద్రపు బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL) ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL) ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ఈ భారీ వంతెనకు అటల్ సేతుగా నామకరణం చేశారు. రూ. 17,840 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా దీన్ని నిర్మించారు. ముంబై – నబీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతోంది. కానీ ఈ వంతెన అందుబాటులోకి రావడంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ముంబై, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు త్వరగా చేరుకోవచ్చు. ముంబై నుంచి పుణె, గోవాకు త్వరగా చేరుకోవచ్చు. ముంబై పోర్టు, జవహర్ లాల్ నెహ్రూ పోర్టు మధ్య వాణిజ్య సదుపాయాలు మరింత మెరుగు పడనున్నాయి. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా, 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంలో నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ వంతెన శనివారం నుంచి వాహనదారులకు అందుబాటులోకి రానుంది. టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ బ్రిడ్జిపైకి అనుమతి లేదు.
ఈ వంతెన ప్రారంభానికి ముందు మోదీ నాసిక్‌లో నిర్వహించిన మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో 35 నిమిషాల పాటు 2 కిలోమీటర్లకు పైగా కొనసాగింది. శ్రీకాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో మోదీ పాల్గొన్నారు.