అయోధ్య బాలక్‌ రామ్‌కు ఆంజనేయుడి పలకరింపు!

అయోధ్య రామాల‌యానికి భ‌క్తుల తాకిడి కొనసాగుతోంది. సంద‌ర్శ‌కుల తాకిడికి త‌గిన‌ట్లుగానే దేవాల‌యం అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు

  • Publish Date - January 24, 2024 / 10:11 AM IST

అయోధ్య (Ayodhya) రామాల‌యానికి భ‌క్తుల తాకిడి కొనసాగుతోంది. సంద‌ర్శ‌కుల తాకిడికి త‌గిన‌ట్లుగానే దేవాల‌యం అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంద‌ట్లోనే ఒక వానరం (Monkey) .. ఏకంగా రామాల‌యం గ‌ర్భ‌గుడిలోకి ప్ర‌వేశించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఆలయ పూజారి ఒక‌రు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆ రోజు సాయంత్రం 5:50 గంట‌ల‌కు ఒక వానరం గ‌ర్భ‌గుడి ద‌క్షిణ ద్వారం ద్వారా లోప‌ల‌కు ప్ర‌వేశించింది. వెంట‌నే బాలక్ రాముని మూల‌మూర్తి వ‌ద్ద‌కు చేరుకుంది. అప్ప‌టికి భ‌ద్ర‌తా సిబ్బంది దానిని గ‌మ‌నించిన‌ప్ప‌టికీ.. కోతిని త‌రిమితే అది భక్తుల‌పై దాడికి దిగే ప్ర‌మాద‌ముంద‌ని భావించారు.


మ‌రోవైపు విగ్ర‌హాన్ని ఏమైనా పాడు చేస్తుందేమోన‌ని ఆందోళ‌నా చెందారు. దాంతో ధైర్యం చేసి దాని వైపు అదిలించిన‌ట్లు క‌దిలారు. అయితే అది విగ్ర‌హం ప‌ట్ల ఏమాత్రం అమర్యాద‌గా ప్ర‌వ‌ర్తించ‌కుండా గ‌ర్భ‌గుడిలో కాసేపు తిరిగి, విగ్ర‌హం వైపు చూసి ఉత్త‌ర ద్వారం ద్వారా బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. అది మూసేసి ఉండ‌టంతో తూర్పు ద్వారం గుండా బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో అది భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యాన్నీ క‌లిగించ‌లేదు. ఉత్స‌వ విగ్ర‌హాన్ని కింద ప‌డేస్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ అది అలాంటి ప‌నుల‌కు దిగ‌లేద‌ని శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ్ క్షేత్ర ట్ర‌స్టు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.


మరోవైపు ఈ వాన‌రాన్ని భ‌ద్ర‌తా సిబ్బంది, భ‌క్తులు హ‌నుమాన్‌గా భావించ‌డం గ‌మ‌నార్హం. తాము ఈ వాన‌రాన్ని హ‌నుమాన్‌గా భావిస్తున్నామ‌ని.. ఆయ‌నే రాముల‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి విచ్చేశార‌ని ఆ స‌మ‌యంలో విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెప్పుకొచ్చారు. అయోధ్య రామాల‌యం ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాన‌ని చెప్ప‌డానికే హ‌నుమాన్ ఈ విధంగా వ‌చ్చార‌ని మ‌రికొందరు భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 500 ఏళ్ల నిరీక్ష‌ణ అనంత‌రం నిర్మిత‌మైన భ‌వ్య రామ‌మందిరాన్ని ప్ర‌ధాని మోదీ సోమ‌వారం ప్రాణ ప్ర‌తిష్ఠ చేసి ప్రారంభించిన విష‌యం తెలిసిందే.