MP Venkatesh | బీఆరెస్‌కు ఎంపీ వెంకటేశ్ గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరిక
లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆరెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత గులాబీ పార్టీకి గుడ్‌బై కొట్టి షాక్ ఇచ్చారు

- లోక్‌సభ ఎన్నికల వేళ
- కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేష్,
- నేతలు జీవన్‌రెడ్డి
MP Venkatesh | విధాత : లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు బీ వెంకటేశ్ నేత బోర్లకుంట, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ బోర్డు సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ నేతలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఎంపీ వెంకటేష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్‌తో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మొత్తం 306 దరఖాస్తులు వచ్చాయి. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరి చెన్నూరు నుంచి టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. వివేక్ 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి దివంగత జీ వెంకట్ స్వామి పెద్దపల్లి నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
2019లో వెంకటేష్ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీకగా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆగం చంద్రశేఖర్‌పై 95,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకుగాను తొమ్మది స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకున్నది. బీజేపీ నాలుగు సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకున్నాయి. ఏఐఎంఐఎం హైదరాబాద్ సీటు ఎప్పటిలాగే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.