నాగార్జున సాగర్: BRS, కాంగ్రెస్.. ఎవరికి వారే!
భగత్ VS కోటిరెడ్డి గ్రూపుల వార్ బీఆర్‌ఎస్‌కు దూరంగా తేరా యువత ఆదరణ కోసం కాంగ్రెస్ జానా పాట్లు విధాత: నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల రగడ తరచు రచ్చకెక్కుతుండగా, బీఆర్ఎస్ వైఫల్యాలను సొమ్ము చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ యువత ఆదరణకు దూరమై గెలుపు వాకిట ఎదురీదుతుంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డిల మధ్య నియోజక వర్గ బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భగత్, కోటిరెడ్డి వర్గాలుగా చీలిపోగా ఇద్దరు […]

- భగత్ VS కోటిరెడ్డి గ్రూపుల వార్
- బీఆర్‌ఎస్‌కు దూరంగా తేరా
- యువత ఆదరణ కోసం కాంగ్రెస్ జానా పాట్లు
విధాత: నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల రగడ తరచు రచ్చకెక్కుతుండగా, బీఆర్ఎస్ వైఫల్యాలను సొమ్ము చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ యువత ఆదరణకు దూరమై గెలుపు వాకిట ఎదురీదుతుంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డిల మధ్య నియోజక వర్గ బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భగత్, కోటిరెడ్డి వర్గాలుగా చీలిపోగా ఇద్దరు కూడా గ్రూప్ రాజకీయాలు సాగిస్తున్నారు.
తండ్రి నోముల నరసింహయ్య అకాల మృతితో ఉప ఎన్నికల్లో నెగ్గిన నోముల భగత్ రాజకీయ అనుభవ రాహిత్యం, ఒంటెద్దు పోకడలు, తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్న తీరుతో పార్టీలో, ప్రజల్లో అసంతృప్తిని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన తెలంగాణ ఉద్యమకారులను, కార్యకర్తలను ఎమ్మెల్యే భగత్ పట్టించుకోక పోవడం, నియోజకవర్గంలో తనకు అనుకూలంగా లేని అధికారులను ఏకపక్షంగా బదిలీ చేసి, తన మాట వినే వారిని నియమించుకోవడం విమర్శలకు తావిస్తోంది.
తన సామాజిక వర్గం వారికి పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే భగత్ వైఖరిపై బీసీల్లోని ఇతర సామాజిక వర్గాలను అసహనానికి గురి చేస్తున్నది. ద్వితీయ శ్రేణి పార్టీ నాయకత్వానికి నామినేటేడ్ పదవులు లేకపోవడం కూడా క్యాడర్‌ను నిరాశ పరుస్తుంది.
ఇంకోవైపు నియోజకవర్గంలో డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సాగకపోవడం, ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నెల్లికల్ లిఫ్ట్, డి-8,9 కుంకుడు చెట్ల లిఫ్టు పథకాల నిర్మాణ పనుల్లో పురోగతి లోపించడం, మున్సిపాలిటీలు నందికొండ, హాలియాలతో పాటు గ్రామాల్లో మౌలిక వసంతల కల్పన పనులు పెద్ద ఎత్తున అపరిష్కృతంగా ఉండడం సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్‌కు ఇబ్బందికరంగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు అనుకూలంగా తయారైంది.
అటు సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేసిన కోటిరెడ్డి అదును దొరికినపుడల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కి వ్యతిరేకంగా అంతర్గతంగా పావులు కదుపుతూనే ఉండడం నియోజకవర్గం పార్టీలో గ్రూపుల పంచాయితీకి ఊతమిస్తుంది.
పార్టీకి దూరంగా తేరా.. చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన మరో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కొంతకాలంగా నియోజకవర్గానికి, పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండడం ఆయన వర్గీయులను నిరాశ పరుస్తుంది. సాగర్ నియోజకవర్గంలో ఒకసారి, నల్గొండ పార్లమెంట్ స్థానంలో మరోసారి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఇంకోసారి పోటీ చేసి మూడింటిలోనూ ఓడిన తేరా చిన్నపరెడ్డి చివరాఖరుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖాళీ చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.
ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక జిల్లా బీఆర్ఎస్ రాజకీయాల్లో కనుమరుగైన చిన్నపరెడ్డి అటు సీఎం కేసీఆర్ సభల్లోనూ కనిపించడం లేదు. చిన్నపరెడ్డి కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంత వ్యాపారాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నపరెడ్డికి బలమైన అనుచర వర్గము, ఆదరణ ఉంది.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సాగర్ సెగ్మెంట్లో బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి తేరా చిన్నపరెడ్డి పెద్దదిక్కుగా కనిపిస్తున్నారు. చిన్నపరెడ్డి ఫార్మ వ్యాపారాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో నీవే కావడంతో ఆయనను పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.
యువతకు దగ్గరైతేనే కాంగ్రెస్‌కు మనుగడ
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పై నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే. జానారెడ్డి వైఫల్యం బిఆర్ఎస్‌కు కలిసి వస్తుంది. ముఖ్యంగా తన రాజకీయ జీవితంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, నాలుగుసార్లు ఓడిన కే. జానారెడ్డికి నియోజకవర్గంలోని యువతరం ఓటర్లలో పట్టు లేకపోవడం కాంగ్రెస్ గెలుపుకు ఆటంకంగా తయారైంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నరసింహయ్య చేతిలో, 2021 ఉప ఎన్నికల్లో నోముల భగత్ చేతిలో ఓడిన జానారెడ్డి మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేక మిర్యాలగూడకు మారుతారా అన్నది సందిగ్ధంగా ఉంది. వయసు మీరిన జానారెడ్డికి యువతరం ఓటర్లకు మధ్య పెరిగిన దూరాన్ని పూడ్చేందుకు తన కుమారులైన కుందూరు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి యువతరంలో పట్టు సాధించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడం కాంగ్రెస్ కు ప్రతికూలంగా కనిపిస్తుంది.
జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో అటు మిర్యాలగూడ ఇటు సాగర్ నియోజకవర్గాల్లో తానూ, తన కుమారులలో ఒకరిని పోటీకి దించాలని యోచిస్తున్నారు. అయితే బీజేపీ అటు తేరా చిన్నపరెడ్డితో పాటు ఇటు జానా వారసులపై సైతం కన్నేసి ఉండడంతో ఎన్నికల నాటికీ సాగర్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనన్నది ఆసక్తికరంగా మారింది.