ఎంపీ టికెట్లలో ఉద్యమకారులకు మొండిచేయి..బీఆరెస్‌లో అసమ్మతి రేపిన నల్లగొండ, భువనగిరి టికెట్ల ఖరారు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వైనం నుంచి గుణ పాఠం నేర్వని బీఆరెస్ అధిష్టానం పార్లమెంటు ఎన్నికల్లోనూ

  • Publish Date - March 24, 2024 / 11:57 AM IST

సీనియర్లకు మళ్లీ భంగపాటే

విధాత, హైదరాబాద్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వైనం నుంచి గుణ పాఠం నేర్వని బీఆరెస్ అధిష్టానం పార్లమెంటు ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికలో తప్పటడుగులు వేసిందని ఆ పార్టీ కేడర్ అసంతృప్తిని వెళ్లగక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 12స్థానాల్లో కనీసం సగం స్థానాల్లోనైనా సిటింగ్‌లను మార్చి ఉంటే మరిన్ని సీట్లు గెలిచే పరిస్థితి ఉన్నా పట్టించుకోకుండా చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం సిటింగ్‌లను మార్చక తప్పు చేశానంటూ చింత చేశారు. చివరకు సూర్యాపేటలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఒక్కరే త్రిముఖ పోటీలో గెలిచామనిపించారు.

ఈ నేపథ్యంలో నల్లగొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ గట్టి కసరత్తు చేస్తారనే అంతా భావించారు. చివరదాకా ఈ రెండు సీట్ల అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్‌ సస్పెన్స్ పాటించడం చూసిన కేడర్‌ ఈ సీట్లలో గెలుపు ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న అంచనాల్లో మునిగారు. తీరా చూస్తే ప్రకటించిన అభ్యర్థులను చూసి పార్టీ కేడర్ సైతం ఖంగుతిన్నారని ఆ పార్టీ వర్గాల్లో అంతర్గత ప్రచారం జోరందుకుంది. నల్లగొండ ఎంపీ స్థానానికి బీఆరెస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డిలతో పాటు ఉద్యమకారులు చాడ కిషన్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్‌లు రేసులో ఉన్నారు. వారందరిని కాదని నల్లగొండ అసెంబ్లీ సీటులో ఓడిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థిగా పెట్టారు. కంచర్ల సోదరులు 2018అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముందు టీడీపీ నుంచి బీఆరెస్‌లో చేరారు.

వారిద్దరిలో నల్లగొండ నియోజకవర్గాన్ని పట్టుకుని రాజకీయం చేసుకున్న భూపాల్‌రెడ్డి ఒకసారి ఎలాగోలా 2018అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పర్యాయానికే తన దుందురుసు, అహంకార పూరిత వైఖరితో అంతులేని ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక కంచర్ల కృష్ణారెడ్డి మునుగోడు, కొంత నకిరేకల్‌ నియోజకవర్గం రాజకీయాలకే పరిమితమయ్యారు. హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌, నల్లగొండ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జీలుగా వ్యవహరించినప్పటికి బీఆరెస్‌లో ఇంచార్జిల పాత్ర నామమాత్రమే. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలు, గ్రామాల కార్యకర్తలతో కృష్ణారెడ్డికి సరైన పరిచయాలు కూడా లేవు. అదిగాక గుత్తా సుఖేందర్‌రెడ్డితో సహా పలువురు బీఆరెస్ నేతలతో కంచర్ల సోదరులకు విబేధాలున్నాయి.

ఉద్యమకారుల్లో, ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో వారిని గట్టిగా వ్యతిరేకించేవారు అధికంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ సీనియర్లను, ఉద్యమకారులను కాదని కేసీఆర్ నల్లగొండ ఎంపీ టికెట్‌ను కంచర్లకు కేటాయించడం కేడర్‌ను ఒకింత విస్మయానికి, అసంతృప్తికి గురి చేసింది. నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న హుజూర్‌నగర్ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో కృష్ణారెడ్డి తలపడాల్సివుంది. గతంలో అడ్వకేట్‌గా పనిచేసిన కాంట్రాక్టర్‌ కంచర్ల కృష్ణారెడ్డి స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి గతంలో 1999, 2009, 2014లలో మూడుసార్లు నల్లగొండ ఎంపీగా ఎన్నికయ్యారు.

బీఆరెస్ అధిష్టానం ఇప్పటికే గుత్తా సుఖేందర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అమిత్‌రెడ్డిని దూరం పెట్టడంతో వారు ఈ ఎన్నికల్లో కంచర్ల గెలుపుకు సహకరించడం అత్యాశే అవుతుంది. అమిత్‌రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారు. ఇక బీసీలకు, ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ అటు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, ఇటు బీఆరెస్‌లోనూ నినాదమెత్తుకున్న చెరుకు సుధాకర్‌గౌడ్ ఇప్పుడేమి చేయబోతారన్నది ఆసక్తికరం. అలాగే మొదటి నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డితో విభేదిస్తున్న ఉద్యమకారులు చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ వంటి వారి నుంచి కూడా సహకారం సందేహమేనన్నవాదన కేడర్‌లో వినవస్తున్నది. ఇకపోతే నల్లగొండ టికెట్ రాకపోవడంతో తేరా చిన్నపరెడ్డి బీఆరెస్‌కు రాజీనామా చేయడంతో ఆ మేరకు పార్టీ విజయవకాశాలకు గండి పడింది.

భువనగిరి అభ్యర్థి ఎంపికలోనూ అదే తీరు

భువనగిరి ఎంపీ సీటు కోసం పార్టీ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, ఉద్యమనేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లు ప్రయత్నించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీలో చేరిన భిక్షమయ్యగౌడ్‌కు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డికి పదవుల విషయమై పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీ నేపథ్యంలో వారిలో ఒకరికి ఎంపీ టికెట్ ఇస్తారని భావించారు. అయితే అనూహ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు చెందిన క్యామ మల్లేశ్‌కు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వడం కేడర్‌ను ఆశ్చర్యపరిచింది. గొల్లకురుమ సామాజిక వర్గంకు చెందిన క్యామ మల్లేశ్ 2018ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లో చేరారు. క్యామ మల్లేశ్‌కు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇబ్రహీమ్‌పట్నం మినహా మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా పట్టులేకపోవడం..ప్రత్యర్థి బీజేపీ నుంచి బరిలో ఉన్న మాజీ బీఆరెస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు బీఆరెస్ కేడర్‌లో మంచి పట్టుండటం గమనార్హం. మల్లేశ్‌కు పోటీగా టికెట్ ఆశించిన బూడిద, జిట్టా, దూదిమెట్ల, పైళ్లతో పాటు ఇతర నియోజకవర్గాల నేతల సహకారం అందడంలో అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరన్నది తేలితేగాని అసలు పోటీ ఎవరి మధ్య ఉండబోతుందో తేలనుంది. బీఆరెస్‌, బీజేపీలు బీసీ అభ్యర్థిని నిలబెట్టినందునా గెలుపు వ్యూహాల మేరకు కాంగ్రెస్ ఖచ్చితంగా రెడ్డి అభ్యర్థిని పోటీ పెట్టనుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం చామల ఉదయ్‌కిరణ్‌రెడ్డి, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆరెస్‌ను వీడుతారని భావిస్తున్న గుత్తా అమిత్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డిలు రేసులో ఉన్నారు.