Nalgonda | 25న నల్గొండకి BJP చీఫ్ నడ్డా రాక? పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ!
Nalgonda | విధాత: బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ ఈనెల 25న నల్గొండలో నిర్వహించేందుకు ఆ పార్టీ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహాజన సంపర్క అభియాన్ లో భాగంగా 100 నియోజకవర్గాలలో పార్టీ సభలు నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రం నల్లగొండలో నడ్డా సభ నిర్వహణకు బిజెపి నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజెపి బలోపేతం కోసం, ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పెంచేందుకు […]

Nalgonda |
విధాత: బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ ఈనెల 25న నల్గొండలో నిర్వహించేందుకు ఆ పార్టీ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహాజన సంపర్క అభియాన్ లో భాగంగా 100 నియోజకవర్గాలలో పార్టీ సభలు నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రం నల్లగొండలో నడ్డా సభ నిర్వహణకు బిజెపి నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజెపి బలోపేతం కోసం, ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పెంచేందుకు జాతీయ నాయకత్వం మార్గదర్శకంలో రాష్ట్ర, జిల్లా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే నల్గొండలో మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా పర్యటించారు.
ఈనెలాఖరు వరకు రాష్ట్రంలో మహాజన సంపర్క అభియాన్ సభలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీకి ప్రజాదరణ పెంచాలని బిజెపి అగ్రనాయకత్వం తలపోస్తుంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు సీట్ల సాధన పై కూడా బిజెపి కన్నేసింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిజెపికి అంతో ఇంతో నల్లగొండ, మునుగోడు, సూర్యాపేట, భువనగిరి నియోజకవర్గాలలో పార్టీకి సంస్థగతంగా ఓట్ల పరంగా బలం ఉంది. గతంలో నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీలలో బిజేపి ఛైర్మన్ పదవులు సైతం సాధించింది. ఓటు బ్యాంకు డివిజన్ కోణంలోనూ అయా నియోజకవర్గాలు బిజెపికి అనుకూలంగా ఉన్నాయి.
అలాగే గతంలో నల్లు ఇంద్రసేనారెడ్డి నల్గొండ లోక్ సభ స్థానంలో గట్టి పోటీనిచ్చిన చరిత్ర ఉంది. బిజెపి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1991,1998 పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం, 1996, 2004 ఎన్నికల్లో రెండో స్ధానం సాధించిన నేపథ్యంలో గట్టి అభ్యర్థులను దింపిన పక్షంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిజెపి అసెంబ్లీ, లోక్ సభ సీట్ల ఖాతా తెరవచ్చని ఆ పార్టీ నాయకత్వం ఆశిస్తుంది.
ఈ దిశగా పార్టీని ప్రజల్లో మరింత విస్తరించే లక్ష్యంతో మహజన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా 25న నల్గొండలో నడ్డా సభ నిర్వహణకు బిజెపి నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.