విధాత: ప్రేమ వివాహం నేపథ్యంలో చోటుచేసుకున్న పరువు హత్య కేసులో యువకుడిని హత్య చేసిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లుగా నల్గొండ జిల్లా ఎస్పీ కే అపూర్వరావు తెలిపారు. సోమవారం కేసు వివరాలను మీడియా ముందు వెల్లడించారు.
హత్యకు గురైన ఇరిగి నవీన్ గత నాలుగు సంవత్సరాల నుండి వారి గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని ప్రేమిస్తూ తన వెంట పడుతూ వేధింపులకు గురి శాడు. విషయం తెలిసి అమ్మాయికి వరుసకు తమ్ముడైన మణిదీప్ నవీన్‌ను మందలించాడు. సదరు అమ్మాయి కూడా మృతుడిని తన వెంట పడొద్దని తనను మరిచిపోమని చెప్పడం జరిగింది. దాంతో మృతుడు నవీన్ మనస్థాపం చెంది ఈ ఏడాది మార్చి 20న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కొలుకున్నాడు.
మరల సదరు అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతుండగా అమ్మాయి తమ్ముడు మణిదీప్, అతని స్నేహితుడు శివప్రసాద్ కలిసి మృతుడిని బెదిరించారు. విషయాన్ని నవీన్ తన స్నేహితుడైన ఈట అనిల్ కుమార్‌కు తెలిపి అతని సహాయం కోరడం జరిగింది. ఏప్రిల్ 9న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతుడు నవీన్, తన స్నేహితుడు అనిల్ కలిసి నేరస్థులయిన శివప్రసాద్, మణిదీప్‌లను గుంటిపల్లి గ్రామంలోని తిరుమల్ ఇంటి వద్దకు మాట్లాడుకోవడానికి రమ్మని పిలిచారు.
మణిదీప్, శివప్రసాద్‌లు, మిగతా నేరస్థులకు ఈ విషయాన్ని తెలిపి వారిని అన్నారం గ్రామంలోని బస్ స్టాప్ వద్దకు పిలిచి అందరూ కలిసి నవీన్‌ను చంపాలని పథకం పన్నారు. కర్రలు, కత్తులు తీసుకుని మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో శివ ప్రసాద్ పథకం ప్రకారం నవీన్‌కు ఫోన్ చేసి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. అందరూ నేరస్తులు కలిసి మధ్యాహ్నం 3:40 గంటల సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై గుంటుపల్లిలోని తిరుమల్ ఇంటి దగ్గరకు వెళ్లగా, నవీన్ తన స్నేహితులైన అనిల్, తిరుమల్‌తో కలిసి బీరు తాగుతూ ఉండడం గమనించారు.
నవీన్, అనిల్‌లను అందరూ కలిసి చుట్టుముట్టి కర్రలతో దాడి చేయగా అనిల్‌కు దెబ్బలు తగలగా, నవీన్ వారి నుండి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. నేరస్తులందరూ అతనిని వెంటాడి కర్రలతో కొట్టగా, రామలింగం తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్‌ను 11 సార్లు పొడవగా అక్కడికక్కడే మరణించాడు. తరువాత నేరస్థులందరూ వారు తెచ్చుకున్న మూడు ద్విచక్ర వాహనాలపై అక్కడి నుంచి పారిపోయారు. మార్గమధ్యంలో కత్తిని ముళ్ళ పొదలలో పడవేసి, నేరస్థులందరు గుంటూరుకు పారిపోయి ఆ రోజు నుండి అక్కడే తలదాచుకున్నారు.
వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో, డబ్బులు, దుస్తుల కోసం ఇంటికి రాగా నిడమనూరు ఎస్ ఐ, త్రిపురారం ఎస్ఐ లు సిబ్బందితో కలిసి నేరస్థులను పట్టుకొని మిర్యాలగూడ DSP ముందు హాజరు పరచినారు. DSP వారిని విచారించగా వారు చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. కేసులో తొమ్మిది మంది నేరస్థులలో ఇద్దరు బాల నేరస్థులున్నారు. వారిని సోమవారం రిమాండ్ నిమిత్తం కోర్టు
ముందు హాజరు పరిచారు.
నిందితులలో త్రిపురారం మండలం సత్యనారాయణపురానికి చెందిన రామలింగం(28), అన్నారంకు చెందిన రాజు( 23), శివ ప్రసాద్ (19), రాజేష్ (30), మణితేజ(20), సత్యనారాయణపురంకు చెందిన కోటయ్య(30), సురేష్( 35)లతో పాటు ఇద్దరు మైనర్ నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా కేసులు చేధించిన మిర్యాలగూడ DSP పి. వెంకటగిరి, హాలియా CI గాంధీ నాయక్, నిడమనూరు SI M.శోభన్ బాబు, త్రిపురారం ఎస్సై G.శోభన్ బాబులను, సిబ్బందిని ఎస్పీ అపూర్వరావు అభినందించారు.