విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నది. కాబట్టి ఈ సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమే. పార్టీలు మారినప్పుడు నేతలు ఆయా పార్టీల పరిణామాలు, పార్టీ అధిష్టానాలపై కొన్న విమర్శలు, కొన్ని ఆరోపణలు చేయడమూ కొత్తేమీ కాదు.ఈ నేపథ్యంలోనే నల్లారి వారు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయంపై ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలే హాస్యాస్పందంగా ఉన్నాయి.
‘నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో తన కుటుంబం అనుబంధం కొనసాగిందని, తన ఎదుగుదలకు కారణమైన పార్టీని వీడాల్సి వస్తుందని భావించలేదన్నారు. గత 30 ఏళ్లుగా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారు, కార్యకర్తల కష్టంతో పార్టీ ఎదిగింది. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ ప్రజలకు దూరమవుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం నాయకుల అభిప్రాయాలు తీసుకోదు. ప్రజలతో మమేకం కాదు. తప్పులు సమీక్షించుకొని ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు.
ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌లో ఆత్మవిమర్శలేదు. మా తప్పులేదు. ఓటు వేయని ప్రజలదే తప్పనే మనస్తత్వం నాయకత్వంలో ఉన్నది. ఆ కారణంతోనే పార్టీని వీడుతున్నా. దేశం, పార్టీ విషయాల్లో బీజేపీ నాయకత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. తాను, మోడీ సీఎంలుగా ఉన్నప్పుడు కలిశాం. నాటి నుంచి ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికీ అదే పంథాలో కొనసాగుతున్నారు’ అని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనో, లేదా ఏపీలోనో అధికారంలో ఉండి ఉంటే ఆయన ఈ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండకపోయేది. బీజేపీ ఎలా ఎదిగింది అన్నది అందరికీ తెలిసింది. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాతీర్పును కాలరాసి 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన సంగతి నల్లారి వారికి తెలియదేమో. కాంగ్రెస్ అధిష్ఠానం నాయకుల అభిప్రాయాలు తీసుకోదు అన్నారు. బహుశా ఆయన రాష్ట్ర విభజనపై ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్య చేసి ఉంటారు.
వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్‌ను సీఎం చేయాలని 150 మందికి ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా పార్టీ అధిష్ఠానం పదవి అనేది వారసత్వంగా ఇచ్చేది కాదని, అది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కాల్సిన ప్రతిఫలం అని నాడు రోశయ్యను సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత నల్లారికి కూడా అవకాశం ఇచ్చింది. ఆ సమయంలోనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాల్సిన స్థానంలో ఉన్నందున పార్టీ ఉద్దేశాలను కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టంగానే చెప్పింది.
ఇప్పుడు ఆయన గొప్పగా చెబుతున్న1997లోనే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నబీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్, సీపీఐ, ప్రజారాజ్యం ఇలా అన్నిపార్టీలు అంగీకారం తర్వాతనే తెలంగాణపై అనుకూల ప్రకటన చేసింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించింది. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్ననిర్ణయాన్ని అమలు చేయాల్సిన సభా నాయకుడి స్థానంలో ఉన్న నల్లారి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా లాస్ట్ బాల్ సిక్స్ కొడతానని చెప్పి హిట్ వికెట్ అయ్యాడు.
మోడీ అవినీతికి వ్యతిరేకంగా నాడూ.. ఇప్పుడూ అదే పంథాను కొనసాగిస్తున్నారని కిరణ్‌కుమార్‌రెడ్డి కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీల నుంచి వీడి బీజేపీలో చేరిన నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ బీజేపీలో చేరగానే.. మోడీ-షాల ఆశిస్సులు అందగానే వాళ్లందరికీ సచ్ఛీలురు అనే సర్టిఫికెట్ పొందారు. తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ నేతలు ఎలా వ్యవహరిస్తారు అన్నది మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిన ఉదంతాన్ని దేశమంతా చూసింది.
కానీ కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇదంతా మోడీ దేశం కోసం ధర్మం కోసం చేశారని భావిస్తున్నాడు కావొచ్చు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తాను అన్నారు. అయితే విభజన సమయంలో ఏపీ అభివృద్ధికి నాటి యూపీఏ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రధాని తొమ్మిదేళ్లుగా విభజనపై కాంగ్రెస్ విమర్శలు చేయడమే గాని విభజన హామీలను గాలికి వదిలేశారు. పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పాటైన నాటి ఆంధ్ర రాష్ట్రం నేటి ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని కావాలని సగటు ప్రజల కల ఇప్పటికీ నెరవేరలేదు.
ఘనత వహించిన మోడీ రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీళ్లు, మట్టి తప్పా ఏమీ ఇవ్వలేదన్న విషయాన్నిఆ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. అంతేకాదు మాజీ సీఎంగా ఆయన కంటే నటుడు పవన్ కల్యాణ్‌కు ఆపార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని బట్టి బీజేపీ అధిష్ఠాన పెద్దల ఆలోచనలు ఏమిటో తెలిసిపోతున్నది. నిజం నిద్ర లేచేలోగా అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది అన్నట్టు నల్లారికి వారికి త్వరలోనే తత్త్వం బోధపడుతుంది అని అంటున్నారు