New Delhi
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి తెలిపారు.
ఈ సమావేశాలు ఆగస్ట్ 11వ తేదీ వరకూ కొనసాగుతాయి. శనివారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్రమంత్రి.. ఈ సమావేశాల్లో ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని రాజకీయ పార్టీలను కోరారు.
ప్రస్తుతానికి పాత భవనంలోనే సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. మధ్యలో కొత్త భవనంలోకి మారే అవకాశం ఉందని చెప్పాయి.మే 28వ తేదీన కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే.
దాదాపు నెల రోజులపాటు సాగే వర్షాకాల సమావేశాల్లో 17 సిటింగ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
దీనితోపాటు గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటోరియల్ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురానున్నది. అనేక కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి.