Kota | సూసైడ్ నివారణ ఫ్యాన్స్ లేని హాస్టళ్లు సీజ్
రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్య నివారణ ఫ్యాన్లు లేని హాస్టళ్లను అధికారులు సీజ్ చేశారు

- రాజస్థాన్ కోటాలో ప్రభుత్వ మార్గదర్శకాలను
- ఉల్లంఘించిన విద్యార్థులపై హాస్టళ్లపై చర్యలు
Kota | విధాత: రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్య నివారణ ఫ్యాన్లు లేని హాస్టళ్లను అధికారులు సీజ్ చేశారు. ఇటీవల కోటాలో తన హాస్టల్‌లో నీట్ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హాస్టళ్లలో సోదాలు నిర్వహించినట్టు అధికారులు శనివారం తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గుర్తించిన నేపథ్యంలో హాస్టల్‌పై చర్యలు ప్రారంభించినట్టు కోటా జిల్లా కలెక్టర్ రవీంద్ర గోస్వామి పేర్కొన్నారు.
గత నెలలో ఒక విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు విచారణ ప్రారంభించింది. విచారణ నివేదిక ఆధారంగా అదనపు మెజిస్ట్రేట్ కోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 133 ప్రకారం చర్యలు ప్రారంభించి హాస్టల్ కంచన్ రెసిడెన్సీని సీజ్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న షరతులను కచ్చితంగా పాటించాలని హాస్టల్ యజమాని హిసుబ్ సోనీ, హాస్టల్ కేర్‌టేకర్ రఘునందన్ శర్మను ఆదేశించినట్టు ఏడీఎం బ్రిజ్ మోహన్ బైర్వా తెలిపారు.
కంచన్ రెసిడెన్సీలో 32 గదులు ఉన్నాయని, వాటిలో 10 మంది విద్యార్థులు ఉండగా, మిగిలినవి ఖాళీగా ఉన్నాయని, ఫిబ్రవరి 5 నాటికి 10 మంది విద్యార్థులను వేరే హాస్టల్‌కు తరలించాలని యాజమాన్యాన్ని ఆదేశించామని గోస్వామి తెలిపారు. కోటా జిల్లా అధికారులు ఆత్మహత్యాయత్నాలను విఫలం చేసే సీలింగ్ ఫ్యాన్‌లకు స్ప్రింగ్ పరికరాన్ని అమర్చాలని హాస్టళ్లను ఆదేశించారు.
నిరుడు కోటాలో 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఏటా రెండు లక్షల మంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకొనే విద్యార్థుల కోసం 4,500 హాస్టళ్లు ఉన్నాయి.