Sreeleela |
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఆ హీరోయిన్ ఉగ్గుపాలతోనే తాగేసినట్టుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్ళు కాకుండానే అమ్మడికి కాస్త ఆఫర్స్ ఉన్నప్పుడే అందినంత డిమాండ్ చేయాలని ఎవరు చెప్పారో కానీ, తన రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచుకుంటూ పోతుందట. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? తనే ఓవర్ నైట్ స్టార్ శ్రీలీల.
‘పెళ్లిసందD’తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ధమాకాతో దుమ్మురేపింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ భామ వచ్చే ఆఫర్స్‌ని బట్టి తనదైన పద్దతిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. చక్కని నటన, చురుకైన డాన్స్‌తో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి, రెండో సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో అందంగా, చురుగ్గా ఉన్న ఈ కుర్ర హీరోయిన్‌ని ‘మా సినిమాలో అంటే.. మా సినిమాలో పెట్టుకోవాలని’ నిర్మాతలు వరుసగా క్యూ కడుతున్నారు.
అందం, చలాకీతనం, నటనతో మెప్పించగలిగే ఫీచర్స్, దీనితో పాటు కాస్త అదృష్టం కూడా తోడవడంతో ఓవర్ నైట్‌లో సరాసరి స్టార్ హీరోయిన్ల సరసన దర్జాగా చేరిపోయిందీ అమ్మడు. ఇక తన డిమాండ్ విషయానికి వస్తే ఇందులోనూ తనకంటూ ప్రత్యేకమైన పద్దతిని ఫాలో కావడం సినీ జనాలకు మింగుడుపడటంలేదు. ఈ విషయమై ఏంటి అమ్మడు మరీ ఎక్కువ డిమాండ్ చేస్తుందనే టాక్ నడుస్తుంది.
అస్సలు ఖాళీ లేకుండా పనిచేస్తూ, గంటకు పాతిక లక్షలు విత్ జిఎస్‌టితో కలిపి మరీ వసూలు చేస్తుందట శ్రీలీల. నాలుగు గంటలు షూటింగ్‌లో కానీ ఉంటే అమ్మడికి కోటి రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అందులోనూ షూటింగ్ జరిగినా, జరగకపోయినా కూడా ఆమెకు ఇవ్వాల్సింది చెల్లించుకోవాల్సిందేనట. ఈ గంటల లెక్కేంటని తలలు పట్టుకుంటున్నారట.
అయినా ఇప్పటివరకూ ఏ హీరోయిన్ కూడా ఇలా జీఎస్‌టీతో కలిపి గంటకు ఇంతని వసూలు చేయలేదని, ఇదే గనక అంతా ఫాలో అయితే కష్టమనే టాక్ కూడా వినిపిస్తోంది. శ్రీలీల రెమ్యునరేషన్ విషయంలో షాకిచ్చినా డిమాండ్‌ని బట్టే చార్జ్ చేస్తుంది అనుకోవాలి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ‘స్కంద, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, ఆదికేశవ, నితిన్ సినిమా.. ఇలా అర డజనుకు పైగా సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ ప్రకటించాల్సి ఉంది.