మద్యం, భూములే.. ఆదాయ వనరులు! ఆ త‌రువాత అప్పులే గ‌తి

మద్యం, భూములే.. ఆదాయ వనరులు! ఆ త‌రువాత అప్పులే గ‌తి
  • ఈ ఆర్థిక సంవత్సరం త‌గ్గిన ఆదాయం
  • త‌ల‌కిందులైన సర్కారు అంచ‌నాలు
  • 5 నెల‌ల‌కే రెవెన్యూ లోటు 3715 కోట్లు
  • ఇప్ప‌టి వ‌ర‌కు అప్పు 26,158.45 కోట్లు

విధాత‌, హైద‌రాబాద్‌: మద్యం అమ్మ‌కాలు, భూముల అమ్మ‌కాల ద్వారా వ‌చ్చిన ఆదాయ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన వ‌న‌రుగా మారింద‌ని కాగ్ విడుద‌ల చేసిన ఆగ‌స్టు నెల లెక్క‌ల్లో స్ప‌ష్ట‌మ‌యింది. వ‌చ్చిన ఆదాయం కంటే ఖ‌ర్చులే అధికంగా ఉండ‌టంతో గ‌డిచిన 5 నెల‌ల కాలానికి రూ.26,158.45 కోట్ల అప్పు చేసింది. వాస్త‌వంగా ఈ ఏడాది మొత్తం 12 నెల‌ల‌కు కలిపి అభివృద్ధి ప‌నుల కోసం రూ.రూ.38,234.94 కోట్ల అప్పు తీసుకుంటామ‌ని బ‌డ్జెట్ పొందుప‌రిచి అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు.


ఈ అప్పును నెల‌కు రూ.3,193.745 కోట్ల చొప్పున 5 నెల‌ల‌కు రూ.15,968.725 కోట్ల మేర‌కు మాత్ర‌మే రుణం తీసుకోవాల్సి ఉండ‌గా, రూ.10,189.725 కోట్ల అప్పు అద‌నంగా తీసుకున్న‌ది. మ‌రోవైపు ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.4881.74 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుంద‌ని అంచ‌నా వేసే, ఈ ఐదు నెల‌ల‌కే రూ.3715.43 కోట్ల రెవెన్యూ లోటు ఏర్ప‌డింది. ప్రాథ‌మిక లోటు రూ. 17306.74 కోట్లుగా న‌మోదైంది.


అంచనాలు తలకిందులు


రాష్ట్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ప్ర‌భుత్వానికి ప‌న్నుల రూపంలో వ‌చ్చే ఆదాయం గ‌త ఏడాది కంటే 3శాతం త‌గ్గింది. గ‌త ఏడాది గ‌డిచిన 5 నెల‌ల కాలానికి 39.26 శాతం ప‌న్నులు వ‌సూలు కాగా ఈ ఏడాది 36.36 శాత‌మే వ‌సూల‌య్యాయి. ఇందులో గ‌త ఏడాది కంటే మ‌ద్యం ఆదాయం 10శాతం కంటే అద‌నంగా పెరిగిన‌ప్ప‌టికీ మొత్తం ప‌న్నుల ఆదాయం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. అలాగే జీఎస్టీ ఆదాయం 2 శాతానికి పైగా త‌గ్గ‌గా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 7శాతానికి పైగా త‌గ్గింది. సేల్స్ టాక్స్ 6 శాతం వ‌ర‌కు త‌గ్గింది. కేంద్రం నుంచి ప‌న్నుల్లో వాటా గ‌త ఏడాదిలానే వ‌చ్చాయ‌ని కాగ్ తెలిపింది. మ‌ద్యం ఆదాయం 10 శాతం పెరిగినా, కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు గత ఏడాది మాదిరిగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ పెర‌గాల్సిన ఆదాయం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.


పన్నేతర ఆదాయమే ఎక్కువ


మ‌రోవైపు ప‌న్నేత‌ర ఆదాయం కింద‌ భూముల అమ్మ‌కాల ద్వారా గ‌త ఏడాది కంటే వంద శాతానికి పైగా ఆదాయం వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌త ఏడాది ప‌న్నేత‌ర ఆదాయం 30.84 శాతం కాగా ఈ ఏడాది 63.50 శాతానికి పెరిగింది. ఒక్క ఆగస్ట్‌ నెలలోనే భూముల అమ్మకాల ద్వారా 12,666.94 కోట్ల ఆదాయం లభించినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. జూలై వరకు పన్నేతర ఆదాయం 1,815.45 కోట్లు ఉండగా.. ఆగస్ట్‌ నెలాఖరుకు 14,482.39 కోట్లు ఆదాయం రావడం వెనుక కోకాపేట, మోకిల తదితర ప్రధాన ప్రాంతాల్లో భూముల అమ్మకాలే కారణమని తెలుస్తున్నది.


ప‌న్నేత‌ర ఆదాయం ప్ర‌ధానంగా భూముల అమ్మ‌కాల ద్వారానే వ‌స్తుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఆదాయం త‌గ్గ‌డంతో తెలంగాణ స‌ర్కారు మ‌ద్యం అమ్మ‌కాల‌పై వ‌చ్చే ఆదాయంతో పాటు, భూముల అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం, రుణాలు తీసుకోవ‌డం ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటోంద‌ని కాగ్ త‌న నివేదిక‌లో పేర్కొన్నది.