బోరు బావిలో నవజాత శిశువు.. ఐదు గంటలు శ్రమించి రక్షించిన అధికారులు
బోరుబావిలో పడేసిన నవజాత శిశువును ఐదు గంటలపాటు శ్రమించి అధికారులు ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటన ఒడిశాలోని లరిపలి గ్రామంలో చోటుచేసుకున్నది

- ఒడిశాలోని సంబర్‌పూర్ జిల్లాలో ఘటన
విధాత: బోరుబావిలో పడేసిన నవజాత శిశువును ఐదు గంటలపాటు శ్రమించి అధికారులు ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా లరిపలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లరిపలి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఓ మహిళ జీడిమామిడి తోటలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆమెకు శిశువు ఏడుపు వినిపించింది.
చుట్టుపక్కల చూడగా ఎవరూ కనిపించలేదు. క్షుణ్ణంగా గమనించగా ఒక ప్రాంతం నుంచి ఏడుపు శబ్దాన్ని గుర్తించింది. 15 అడుగుల లోతైన బోరు బావి నుంచి శిశువు ఏడుపు విని షాక్‌కు గురైంది. బోరుబావిపై పెద్ద బండరాయి కప్పి ఉంచారు. ఈ విషయాన్ని ఆమె స్థానికులకు తెలియజేసింది. గ్రామస్థులు అధికారులకు ఫోన్ చేశారు.
జిల్లా అధికార యంత్రాంగం జేసీబీ, మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బందితో హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకున్నది. చిన్నారికి ఆక్సిజన్ అందిస్తూనే సహాయ చర్యలు చేపట్టారు. మూడు జేసీబీలతో ఐదు గంటలపాటు శ్రమించి సమాంతరంగా గుంతను తవ్వి ఒకటి, రెండు క్రితమే పుట్టిన ఆడ శిశువును ప్రాణాలతో రక్షించారు. తదుపరి చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు శిశువును బోరుబావిలో పడవేసి బండరాయిని అడ్డంగా పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.