భోపాల్ : అనాథ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కేర్ టేకర్స్ బాలికలను చిత్రహింసలకు గురి చేశారు. బాలికల బట్టలూడదీసి, తలకిందులుగా వేలాడదీసి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లో వాత్సల్యపురం జైన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో తల్లిదండ్రులు లేని బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. అయితే బాలికలను కొందరు కేర్ టేకర్స్ హింసిస్తున్నారు. బాలికల బట్టలు ఊడదీయడం, నగ్నంగా ఫొటోలు తీయడం, తలకిందులుగా వేలాడదీయడం, వాతలు పెట్టడం, మిర్చిని కాల్చడం ద్వారా వచ్చే పొగను బలవంతంగా పీల్చేలా చేయడం వంటివి చేస్తూ క్రూరంగా ప్రవర్తించారు.
అయితే ఇటీవలే ఆ అనాథాశ్రమాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తనిఖీ చేసింది. దీంతో బాలికలు తమ జరిగిన అవమానాన్ని సీడబ్ల్యూసీ అధికారుల ముందు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనను సీడబ్ల్యూసీ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
వాత్సల్యపురం జైన్ ట్రస్టుపై పోలీసులు జువైనల్ యాక్ట్, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ భయానక హింసకు సంబంధించి నలుగురు కేర్ టేకర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆశ్రమాన్ని సీల్ చేశామని, పిల్లలను ప్రభుత్వ కేంద్రాలకు తరలించామని ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. ఇండోర్ ఆశ్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెం దిన చిన్నారులు ఉన్నట్టు తెలుస్తున్నది.