ఓరుగల్లు రైతు భూమి కోసం పోరుబాట పట్టిండు.. తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై గ్రామంలో, జిల్లా కేంద్రం పోరాటం చేసి.. అక్కడ న్యాయం దొరకదని గ్రహించిన రైతు.. రాజధానిలోనైనా న్యాయం దొరకక పోతుందా? అని నాగలి పట్టుకొని హైదరాబాద్ రోడ్లపైకి వచ్చాడు.
విధాత: ‘నా భూమిని నాకు ఇప్పించండి.. ఆ భూమి నాది కాకపోతే ప్రజల సమక్షంలో హైదరాబాద్‌లోనే నన్ను ఉరితీయండి’ అంటున్నాడు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్. జిల్లా కేంద్రంలో న్యాయం జరుగకపోవడంతో రాజధానిలోనైనా న్యాయం జరుగుతుందేమోనని హైదరాబాద్‌కు వచ్చాడు.
పొలం పనికి వెళ్లడానికి నాగలి పట్టుకొని ఎలా సిద్ధం అవుతాడో అదే విధంగా గోచీ పెట్టుకొని నెత్తికి రుమాల్ చుట్టుకొని చేతిలో సంచి, తనకు న్యాయం చేయాలంటూ నాగలికి బ్యానర్ పెట్టుకొని ఇందిరాపార్క్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లాడు. దారిలో తనను కలిసిన మీడియాకు తన గోసను వినిపించాడు.
తన పేరున ఉన్న భూమిని తనకు కాకుండా చేస్తున్నారని వాపోయాడు. తన భూమి వద్దకు వెళితే దాడి చేసి చేయి విరగగొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు భూమి దక్కకుండా ఎవరెవరు చేస్తున్నారో కూడా పేర్లతో సహా వివరించాడు. చివరకు పోలీసులు కూడా తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
వరంగల్‌లో న్యాయం దొరకడం లేదని, గవర్నర్, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేస్తారని ఇక్కడకు వచ్చానని గోడు వెళ్లబోసుకున్నాడు. బ్యానర్‌పై ఇలా..‘న్యాయం కోసం లంచం ఇవ్వలేను.. గ్రామ లంచగొండు బొమ్మగానికి సదానందం సృష్టించిన స్టాంప్ పేపర్ చట్టబద్ధమైతే నన్ను హైదరాబాద్ నడిబొడ్డున ప్రజల ముందు ఉరివేయండి. పలుమార్లు నా స్వంత తమ్ముడి చేత భూ తగాదాలు సృష్టించి, కర్రలతో కొట్టించి హత్య చేయించుటకు కుట్ర పన్నిన గ్రామ లంచగొండుపై చట్టరిత్యా చర్య తీసుకోగలరు’.. అని బ్యానర్ ప్రదర్శించాడు.