మొసలి తల, ప్రత్యేకమైన తోకతో భారీ జలచరం.. ఎక్కడంటే..?
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న జీవుల కంటే భారీ కాయంతో ఉన్న జీవులు మనుగడ సాధించేవన్న విషయం తెలిసిందే

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న జీవుల కంటే భారీ కాయంతో ఉన్న జీవులు మనుగడ సాధించేవన్న విషయం తెలిసిందే. అప్పట్లో భూమిపై ఉన్న వాయువుల్లో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండటం వల్లే వాటి శరీర నిర్మాణం అలా జరిగినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా అలాంటి ఒక భారీ జలచరాన్ని జపాన్ (Japan) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారికి దొరికిన ఒక శిలాజాన్ని ఆధారం చేసుకుని దాని రూపును డిజైన్ చేశారు. దానిని బ్లూ డ్రాగన్ (Blue Dragon)అని పిలుస్తుండగా శాస్త్రీయ నామం వకయామా సొరయుగా నిర్ణయించారు. ఈ భారీ జీవి సుమారు 7.9 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవనం సాగించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సిన్‌సినాటీ యూనివర్సిటోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన టకూయా కొనిషీ, ఇతర అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో చేసిన ఈ పరిశోధన వివరాలు పాలింయంటాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం.. ఈ బ్లూ డ్రాగన్ శిలాజాన్ని శాస్త్రవేత్తలు 2006లొ కనుగొనగా అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాము శాండ్‌స్టోన్ గనుల్లో ఒక భూ చర జీవి శిలాజం కోసం వెతుకుతుండగా దీని శిలాజం బయటపడిందని టకూయా గుర్తుచేసుకున్నారు. దాని శిలాజం ఎంతో స్పష్టంగా చెక్కుచెదరకుండా ఉందని.. జపాన్‌లో గానీ మొత్తం పసిఫిక్ తీర దేశాల్లో దొరికిన అత్యంత పెద్ద జలచర జీవి శిలాజం ఇదేనని ఆయన అన్నారు.
ఎన్నో ప్రత్యేకతలున్న ఈ బ్లూ డ్రాగన్‌ను ఏదో ఒక జల చర వర్గంలో పెట్టడం సాధ్యపడలేదని.. అందుకే దీనిని ఒక ప్రత్యేక జీవిగా గుర్తించినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మొసలి వంటి తల, పెడల్ ఆకారంలో ఉన్న భారీ రెక్కలు దీని రూపును ప్రత్యేకంగా చేశాయని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రత్యేక ఆకారంలో ఉన్న దీని తోక సాయంతో ఇది అత్యంత వేగంతో వేటాడేదని తేలింది. చైనాలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా డ్రాగన్ ను చెబుతారని… అదే జపాన్ పురాణాల్లో జలచరంగా చెప్పబడిందని టకూయా అన్నారు. అంతే ప్రమాదకరమైనది కాబట్టి దీనికి డ్రాగన్ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.